RSS: కమలం అతివిశ్వాసం వల్లే..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపా కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. వారితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకుని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని స్పష్టం చేసింది.

Updated : 12 Jun 2024 07:08 IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్య

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపా కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. వారితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకుని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో తాజా సంచికలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఓ వ్యాసం ప్రచురితమైంది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌.. క్షేత్ర స్థాయి పోరాట బలగం కాకపోయినప్పటికీ భాజపా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఘ్‌ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదు. అంకిత భావంతో పని చేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. వారికి బదులుగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చారు. స్వీయ ప్రకటిత కార్యకర్తలను నమ్ముకోవడంవల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కుపైగా సీట్ల లక్ష్యం తమది కాదని భాజపా నేతలు, కార్యకర్తలు భావించారు. ఆయనవల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పని చేయలేదు’ అని తాను రాసిన వ్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జీవితకాల సభ్యుడు రతన్‌ శార్దా వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పని చేయడంవల్ల లక్ష్యాలు సాధ్యమవుతాయిగానీ సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలద్వారా కావని పేర్కొన్నారు.

‘543 నియోజకవర్గాల్లో మోదీ పోటీ చేస్తున్నారన్న ప్రచారానికి కొంతే విలువ ఉంటుంది. ఇటువంటి ఆలోచన స్వీయ పరాజయానికి దారి తీస్తుంది. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పని చేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. టికెట్లు ఇచ్చిన వారిలో 25శాతం మంది వలస నేతలే. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఇలాగే 30శాతం టికెట్లను ఫిరాయింపుదారులకు ఇవ్వడంతో పార్టీ ఓటమి పాలైంది. స్థానిక అంశాలు, అభ్యర్థి గుణగణాలు ఎన్నికల్లో ముఖ్యం. ఇటువంటి అంశాల వల్ల స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగి ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. అనవసర రాజకీయం కూడా పార్టీని దెబ్బతీసింది. మహారాష్ట్ర ఇందుకు ఉదాహరణ. అక్కడ పార్టీలను చీల్చడం అనవసరం. భాజపా, శివసేనలకు అసెంబ్లీలో బలం ఉన్నా అజిత్‌ పవార్‌ను చేర్చుకోవడం తప్పిదమే. ఎన్సీపీలో అంతర్గత కలహాలవల్ల శరద్‌ పవార్‌ ఎలాగూ రెండు మూడేళ్లలో కనుమరుగయ్యేవారు. కానీ అజిత్‌ను చేర్చుకోవడంతో భాజపా కార్యకర్తలు మనస్తాపం చెందారు. ఒక్క దెబ్బతో మహారాష్ట్రలో భాజపా అన్ని పార్టీల్లాగే మారిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న కోట కూలిపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బ తీసింది’ అని శార్దా వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని