
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
అగర్తల: త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భాజపా ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలాగే, సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ 51 వార్డులు సహా, 13 మున్సిపల్ కౌన్సిళ్లు, ఆరు నగర పంచాయతీ స్థానాలు కలిపి మొత్తం 334 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 329 చోట్ల భాజపా విజయం దుందుభి మోగించింది. ఇందులో 112 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఈ నెల 25న 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ముఖ్యంగా అగర్తల మున్సిపల్ కార్పొరేషన్లో 51 వార్డులూ భాజపా ఖాతాలోనే పడ్డాయి. రెండు వేర్వేరు నగర పంచాయతీల్లో 2 స్థానాలు, మున్సిపాలిటీలోని ఒక స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా.. తృణమూల్ ఒక మున్సిపల్ స్థానంతో సరిపెట్టుకుంది. 2018లో లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపా పోటీ చేసిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. మరోవైపు ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రంలో అడుగుపెట్టిన మూడు నెలల్లోనే 20 శాతం ఓట్లను గెలుచుకున్నామని, ఇది ప్రారంభం మాత్రమేనని ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా రిగ్గింగ్‌కు పాల్పడిందని తృణమూల్, సీపీఎం ఆరోపించాయి. ఎన్నికల ఫలితాలు భాజపాపై ప్రజలకున్న విశ్వాసాన్ని చాటుతున్నాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.