భయపడేవారు ఆరెస్సెస్‌లో చేరండి: రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీకి భయంలేని నాయకులు మాత్రమే కావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. పిరికివారికి పార్టీలో స్థానంలేదని పునరుద్ఘాటించారు....

Published : 17 Jul 2021 01:07 IST

మాకు మీ అవసరం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి భయంలేని నాయకులు మాత్రమే కావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. పిరికివారికి పార్టీలో స్థానంలేదని ఉద్ఘాటించారు. భయపడేవారంతా పార్టీని వీడి ఆరెస్సెస్‌లో చేరండి అని వ్యాఖ్యానించారు. పార్టీ సోషల్‌ మీడియా బృందంతో శుక్రవారం రాహుల్‌ గాంధీ సమావేశమై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారు. వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు కృషి చేయాలి. పార్టీలో కొందరు భయస్థులు ఉన్నారు. వారిని బయటకు విసిరేయండి. పిరికివారంతా పార్టీని వీడి వెళ్లండి. ఆరెస్సెస్‌ వైపు పరుగులు తీయండి. మీరు మాకొద్దు. పార్టీకి మీ అవసరం లేదు’ అని పేర్కొన్నారు. పార్టీకి భయం లేని నాయకులే కావాలని, అదే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అసమ్మతివాదులను ఉద్దేశించే రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయిన కొద్ది రోజులకే రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లిన ప్రశాంత్‌ కిశోర్‌.. సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపైనే చర్చించినట్లు తొలుత అనుకున్నప్పటికీ.. అంతకుమించి వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భాజపాకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేయడంపై దృష్టి సారించారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని