Kejriwal: దిల్లీ వాసులకు కేజ్రీవాల్ భారీ హామీ.. ఆ సంఘాలకు మిని కౌన్సిలర్స్‌ హోదా

దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తాము అధికారంలో వస్తే.. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు మినీ కౌన్సిలర్‌ హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.

Published : 30 Nov 2022 01:27 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. దీంతో ప్రచార వేగాన్ని పెంచిన అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ ఎన్నికలకు సరికొత్త హామీని తాజాగా ప్రకటించింది. ఎంసీడీ ఎన్నికల్లో తమను గెలిస్తే.. రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్ల (RWAs)కు ‘మినీ కౌన్సిలర్స్‌‌’ హోదా ఇస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు.

‘‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో వస్తే.. రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్ల (RWAs)కు పూర్తి సాధికారితక కల్పిస్తాం. వాటికి రాజకీయంగా, ఆర్థికంగా అధికారాలు అందిస్తాం. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు ‘మినీ కౌన్సిలర్స్‌ హోదా ఇస్తాం’’ అని కేజ్రీవాల్‌ నేడు ప్రత్యేక మీడియా సమావేశంలో తెలిపారు. దిల్లీ ప్రజలను యజమానులుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ హామీని ప్రకటించినట్లు సీఎం వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాము 230 వార్డుల్లో విజయం సాధిస్తామని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

దిల్లీలోని 250 వార్డులకు డిసెంబరు 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 7న ఫలితాలను ప్రకటించనున్నారు. వచ్చే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్దేశించే ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆప్‌, భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని