ఔరంగాబాద్  శంభాజీనగరే: సంజయ్‌రౌత్‌

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. శివసేన తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్సీపీ దీనికి మద్దతు

Updated : 18 Jan 2021 12:24 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. శివసేన తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్సీపీ అటు మద్దతు ఇవ్వట్లేదు.. ఇటు వ్యతిరేకించట్లేదు. ఈ నేపథ్యంలో మిత్రపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఔరంగాబాద్‌ పేరుమార్పును ఎందుకు వ్యతిరేకిస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదంటూనే.. పేరుమార్పు కచ్చితంగా జరుగుతుందని తేల్చిచెప్పారు. ‘‘కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తుందో నాకు తెలియదు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. దీనిపై పార్టీ చర్చకు రావొచ్చు. కానీ, పేరు మార్పు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ విషయంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. ఔరంగాబాద్‌ మా వరకు శంభాజీనగరే’’అని తెలిపారు.

మరోవైపు ఔరంగాబాద్‌ పేరు మార్పు విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి చురకలు అంటేలా శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం ప్రచురించింది. ‘భారతదేశ రాజ్యాంగం లౌకికవాదంతో కూడుకున్నది. ఔరంగజేబు మతాలను ద్వేషించాడు. సిక్కులను, హిందువులను చిత్రహింసలు పెట్టాడు. అలాంటి వ్యక్తి జ్ఞాపకాలపై ఎందుకు దృష్టి పెట్టాలి? అసలు ఎవరీ ఔరంగజేబు?నిజమైన మరాఠాలకు, హిందువులకు ఔరంగజేబుతో ఎలాంటి అనుబంధం లేదు. ఔరంగాబాద్‌ పేరు మార్చడం వల్ల లౌకిక పార్టీల ఓటు బ్యాంక్‌పై ప్రభావం పడుతుందని, ముస్లిం సామాజిక వర్గం అసంతృప్తి చెందుతుందనే ఆందోళన చెందుతున్నారు’’అని కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది.

ఇదీ చదవండి..

బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం: శివసేన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని