Sachin Pilot: దిల్లీకి సచిన్‌ పైలట్.. కారణమేంటి?

కాంగ్రెస్‌ యువనేత జితిన్‌ ప్రసాద భాజపాలో చేరిక.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతికి సెగలకు ఆజ్యం పోస్తున్నట్లే కన్పిస్తోంది. జితిన్‌ పార్టీని వీడిన తర్వాత నుంచి రాజస్థాన్‌లో

Updated : 12 Jun 2021 11:02 IST

దిల్లీ: కాంగ్రెస్‌ యువనేత జితిన్‌ ప్రసాద భాజపాలో చేరిక.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతికి సెగలకు ఆజ్యం పోస్తున్నట్లే కన్పిస్తోంది. జితిన్‌ పార్టీని వీడిన తర్వాత నుంచి రాజస్థాన్‌లో మరో యువనేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పైలట్ దిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

శుక్రవారం సాయంత్రం సచిన్‌ పైలట్‌ దిల్లీ చేరుకున్నారు. ఆదివారం వరకు ఆయన ఇక్కడే పర్యటించనున్నారు. అయితే పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసే ప్రణాళికలేమీ లేవని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ‘సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ చెప్పారు. ఆమె సచిన్‌ తెందూల్కర్‌తో మాట్లాడి ఉండొచ్చు. నాతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు’ అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిగంటల తర్వాత సచిన్‌ దిల్లీ వెళ్లడం గమనార్హం. అయితే ఆయన పార్టీని వీడట్లేదని, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధిష్ఠానాన్ని కలిసేందుకు ఆయన వెళ్లారని పైలట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గతేడాది జులైలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి రేగిన విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు వ్యతిరేకంగా పైలట్‌ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అశోక్‌, పైలట్‌ వర్గం మధ్య నెలకొన్న విభేదాలు ఈ అమస్మతికి కారణమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం పైలట్‌ను బుజ్జగించింది. ఆయన వర్గం లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నెలలు గడిచినా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆయన తాజాగా దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా.. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో పైలట్‌ కూడా ఒకరు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద వంటి యువ నేతలు భాజపాలో చేరిన నేపథ్యంలో పైలట్‌ దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు