
Rajasthan: కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో సంతోషంగా ఉంది: సచిన్ పైలట్
జైపుర్: నేడు రాజస్థాన్‌లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై దాదాపు ఏడాది క్రితం ఆయన తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన డిమాండ్లను అంగీకరిస్తూ.. అధిష్ఠానం కేబినెట్‌లో ఆయన వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం 4 గంటల సమయంలో మొత్తం 15 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దళితులకు స్థానం..
ఈ పరిణామంపై నేడు సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. దళితులు, పేద వర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సానుకూల సంకేతాలు వెళతాయని తెలిపారు. పలుసార్లు ఈ విషయాన్ని పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం సంతోషంగా ఉందన్నారు.
మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి..
కేబినెట్‌లో నలుగురు దళిత నేతల్ని చేర్చుకోనున్నారన్నారని సచిన్ పైలట్ తెలిపారు. దీంతో పార్టీ, ప్రభుత్వం ఆయా వర్గాల్లోకి సానుకూల సంకేతాలు పంపిందన్నారు. సుదీర్ఘకాలంగా కేబినెట్‌లో దళితులకు చోటు లేదన్నారు. తాజాగా దళితులతో పాటు గిరిజనులను కూడా స్థానం కల్పించారన్నారు. 2023లో రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.స్‌లో ఎలాంటి వర్గాలు లేవని.. నిర్ణయాలన్నీ కలిసి కట్టుగానే తీసుకున్నామన్నారు. ఇకపై కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై పనిచేస్తూ భాజపా వైఫల్యాలను ఎండగట్టాలని పిలపునిచ్చారు. ఇటీవలే తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యానన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించానన్నారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తన వర్గానికి పెద్ద పీట..
గత ఏడాది ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల్లో తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. కానీ, పైలట్ డిమాండ్లకు అధిష్ఠానం అంగీకరించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే తాజాగా అధిష్ఠానాన్ని కలిసిన ఆయన తన డిమాండ్ల పరిష్కారం దిశగా పావులు కదిపారు. తన వర్గంలోని కీలక ఎమ్మెల్యేలను కేబినెట్‌లో చేర్చించడంలో ఒకరకంగా విజయం సాధించారు.
మరి పైలట్‌కు ఏ బాధ్యతలు?
అయితే, ఈ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత సచిన్ పైలట్ ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారనే దానిపై స్పష్టత లేదు. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్‌లో పార్టీ బాధ్యతలు నిర్వర్తించాలని రాహుల్, ప్రియాంక కోరినట్లు సమాచారం. కానీ, అందుకు పైలట్ సుముఖంగా లేరని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతులు చేపట్టే అవకాశం ఉంది! ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంపైనే ఆయన దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నట్లు సమాచారం.