MLC Election: తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదు: సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరిక గా భావించడం లేదని సజ్జల స్పష్టంచేశారు.

Updated : 18 Mar 2023 18:06 IST

అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెదేపావి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే తెదేపా వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టంచేశారు.

ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. తాము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరని తెలిపారు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా తెదేపా పోటీ చేసిందని, తెలంగాణలో చేసిన తరహాలోనే తెదేపా ప్రయత్నాలు చేయొచ్చునని ఎద్దేవాచేశారు. అనంతపురంలో రీకౌంటింగ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో(MLC elections) రెండు చోట్ల తెదేపా జయకేతనం ఎగురవేయగా.. పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా(YSRCP), తెదేపా(TDP) పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ తెదేపా, వైకాపా బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని