Sajjala: సీబీఐ జగన్‌ పేరు ప్రస్తావించడం చిల్లర చేష్ట: సజ్జల

వివేకా హత్యకేసులో సీబీఐ.. జగన్‌ పేరు ప్రస్తావించడం దారుణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐవి చిల్లర చేష్టలంటూ అసహనం వ్యక్తం చేశారు. 

Published : 26 May 2023 22:29 IST

హైదరాబాద్‌: వివేకా హత్యకేసులో సీబీఐ.. సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం దారుణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐవి చిల్లర చేష్టలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సడన్‌గా సీబీఐ సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం చిల్లర చేష్టగా అనిపిస్తోంది. సంచలనం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. సీబీఐ లాంటి సంస్థ ఎందుకు సంచలనం చేయాలనుకుంటుందో వివరణ ఇవ్వాలి. దీని వెనుక ఉన్న కుట్రకోణంపై విచారణ చేయాలి. అవినాష్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని సజ్జల ఆరోపించారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేకా మృతి విషయం జగన్‌కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ‘‘వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు. జగన్‌కు అవినాష్‌రెడ్డే చెప్పారా? అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది. విచారణకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. హత్య వెనుక భారీ కుట్రను చెప్పేందుకు అవినాష్‌రెడ్డి ముందుకు రావడం లేదు. హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 వరకు అవినాష్‌ వాట్సప్‌ కాల్స్‌ మాట్లాడారు’’ అని సీబీఐ అనుబంధ కౌంటర్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని