Andhra News: బుగ్గన ‘ఒక్కటే రాజధాని’ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ

మూడు రాజధానుల అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వికేంద్రీకరణకే వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Updated : 15 Feb 2023 16:43 IST

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana Rajendranath) ‘ఒక్కటే రాజధాని’ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) క్లారిటీ ఇచ్చారు. వికేంద్రీకరణే వైకాపా విధానమని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే గతంలో 3 రాజధానుల బిల్లు పెట్టామని గుర్తు చేశారు.

‘‘మూడు రాజధానులకే (Three capitals) వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి. వీటిని మేం మూడు రాజధానులు అనే పిలుస్తాం. బెంచ్‌ కాదు.. హైకోర్టు మొత్తం కర్నూలుకే వస్తుంది. అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది.. అందుకే శాసన రాజధాని అంటున్నాం. ఒకసారి సమావేశాలే గుంటూరులో జరుగుతాయని బుగ్గన ఏ సందర్భంలో అన్నారో తెలియదు. ఆయన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోంది. మేం అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో చెప్పే వాదనే ప్రధానమైంది. ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే బుగ్గన చెప్పారు. వచ్చే ఎన్నికలకు వికేంద్రీకరణపైనే వెళ్తాం’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని