Andhra News: నారాయణ బెయిల్‌పై పైకోర్టుకు వెళతాం!: సజ్జల

కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని మాఫియా ముఠాలా మారాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పది పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సజ్జల స్పందించారు. పరీక్ష ప్రారంభం...

Updated : 12 May 2022 06:31 IST

అమరావతి: కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని మాఫియా ముఠాలా మారాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఆరోపించారు. రాష్ట్రంలో పది పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సజ్జల స్పందించారు. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రాల ఫొటోలు తీసి కొందరికి పంపించారని చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న వారినే ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదు..

‘‘నారాయణ సహా మరిన్ని విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా వ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయి. ఇలాంటి నేరాలు చేస్తోన్న ముఠాను గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. లీకేజీ వ్యవహారంలో నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్లే పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖలు రాయడం వల్ల ఎలాంటి  ప్రయోజనం ఉండదు. వీరి విద్యాసంస్థల వెనుక చంద్రబాబు కూడా ఉన్నారా.. అనేది అర్థం కావడం లేదు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణులను చేసేందుకే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. నారాయణ ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నట్లు డీన్‌గా ఉన్న బాలగంగాధర్ పోలీసులకు తెలిపారు. విద్యాసంస్థల ఛైర్మన్ కానప్పటికీ లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందని తేలితే ఆయన నిందితుడు అవుతాడు కదా..

వారినీ వదలం..

ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నారాయణ బెయిల్‌పై పైకోర్టుకు పోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే నేరుగా చంద్రబాబునే అరెస్టు చేసేవాళ్లం. ఇలాంటివి రిపీట్ చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మాల్ ప్రాక్టీస్‌లో మరికొన్ని విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని తేలింది. వారినీ వదలం.. లీకేజీ వ్యవహారంలో ప్రమేయమున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలితే ఎంతటివారినైనా ప్రభుత్వం వదలిపెట్టదు. చంద్రబాబు సహా ఎవరు అరెస్టైనా ఆధారాలతోనే పోలీసులు అరెస్టు చేస్తారు. అక్రమాలపై కచ్చితమైన ఆధారాలు ఉంటేనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని సజ్జల స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని