Andhra News: తెదేపాతో పొత్తుపై జవాబు చెప్పలేని స్థితిలో పవన్‌: సజ్జల

పొత్తులపై జనసేన, తెదేపా నేతల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతూనే

Updated : 10 May 2022 06:49 IST

అమరావతి: పొత్తులపై జనసేన, తెదేపా నేతల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా అంటే జవాబు చెప్పలేని స్థితిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూనే కూటమిని నడిపిస్తామని చెప్పడమేంటని నిలదీశారు. జనసేన ప్రకటనపై భాజపా స్పందన మరో రకంగా ఉందన్నారు. ఎలాంటి భావసారూప్యత లేని ఈ పార్టీలు ఎలా కలుస్తాయని సజ్జల ప్రశ్నించారు. ఏదో విధంగా సీఎం జగన్‌ను గద్దె దింపి, చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. 

‘‘వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెబుతూనే పొత్తులపై మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి ఓ విధానమంటూ లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గత ఎన్నికల ముందు ఆరోపించిన పవన్.. ఓట్లు పక్కకు పోకుండా డమ్మీలను పెట్టి తెదేపాకు సహకరించారు. జనసేన, తెదేపా.. రెండూ ఒక్కటే. చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా పొత్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. పగటి కలలు కంటున్నారు. బరితెగింపు, ప్రజలంటే లెక్కలేని తనంతో వీరంతా వ్యవహరిస్తున్నారు. పొత్తులపై అందరూ కలసి జనాలను ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కాబట్టే గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఆయనకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఒత్తిడి మేరకు అప్పట్లో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజల మద్దతుతో సీఎం జగన్ ఒంటరిగానే పోటీ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని చేపడుతున్నాం’’ అని సజ్జల పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని