అధికారులను బెదిరించడం సిగ్గు చేటు: సజ్జల

పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ వివాదాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ..

Updated : 06 Feb 2021 20:00 IST

కడప: పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ వివాదాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదో జరగరానిది జరుగుతుందనడం, అధికారులను బెదిరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికారుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేసిన సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికి పరిమితం చేయడం తగదన్నారు.

ఇలా ఎవరూ లేరు..

సర్వాధికారాలు తనకే ఉన్నట్టు వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ లాంటి కమిషనర్‌ను దేశ చరిత్రలో తొలిసారి చూస్తున్నామన్నారు. ఎంతోమంది ఎన్నికల కమిషనర్‌లుగా వ్యవహరించినా ఇలా ఎవరూ లేరన్నారు. గతంలో కంటే ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఏకగ్రీవాలు ఎక్కడ ఎక్కువయ్యాయని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో 50శాతం కూడా ఏకగ్రీవాలు కాలేదని తెలిపారు. ఏకగ్రీవాలు జరగడం ఏ రకంగా నేరమవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి చికాకు కలిగించడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బెదరగొట్టి కమిషన్‌ను పావులా వాడుకోవాలని చూస్తున్నారన్నారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

పెద్దిరెడ్డి ఘటనపై కోర్టుకెళ్తాం: మిథున్‌ రెడ్డి

మంత్రి పెద్ది రెడ్డిని ఇంటికి పరిమితం చేయాలనడంపై కోర్టుకెళ్తామని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులను బెదిరించేలా ఎస్‌ఈసీ తీరు ఉందని మండిపడ్డారు. గుంటూరు, చిత్తూరులో ఉన్నది ఎస్‌ఈసీ నియమించిన కలెక్టర్లేననీ.. మరి ఆ జిల్లాల్లోనే ఎక్కువ ఏకగ్రీవాలు ఎందుకయ్యాయయని ప్రశ్నించారు.

ఏకగ్రీవాలు ఆపాలనడం దారుణం: మోపిదేవి
ఎన్నికలను ఎస్‌ఈసీ వివాదాల్లోకి నెడుతున్నారని వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి మొగ్గు ఉండటం సహజమేనని తెలిపారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఆపాలనడం దారుణన్నారు. ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండేది స్థానిక ఎన్నికల్లోనేనని చెప్పారు. ఏకగ్రీవాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగవన్న ఆయన.. నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెప్పారు.

ఇవీ చదవండి..

గీత దాటితే నిమ్మగడ్డకూ రాజ్యాంగ రక్షణ ఉండదు ఎవ్వరు బెదిరించినా భయపడొద్దు:ఎస్‌ఈసీ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని