Karnataka Elections: ప్రతీకార రాజకీయాలకు కన్నడిగులు గుణపాఠం చెప్పారు.. కాంగ్రెస్‌కు కంగ్రాట్స్‌!

Karnataka elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తూ కన్నడ ప్రజలు ఇచ్చి స్పష్టమైన మెజార్టీని ప్రశంసిస్తూ పలువురు నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

Updated : 14 May 2023 16:48 IST

దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీ అపూర్వ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. భాజపా (BJP) 66 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కాగా..  జేడీఎస్‌ (JDS) 19, ఇతరులు 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సాధించిన విజయం పట్ల భాజపాయేతర పార్టీల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

2024లో కలిసి పనిచేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్టాలిన్‌

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం పట్ల  డీఎంకే చీఫ్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ హర్షం ప్రకటించారు. అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు. సోదరుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు, రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరచడం, హిందీ భాషను బలవంతంగా రుద్దడం, విచ్చలవిడి అవినీతి తదితర అంశాలు ఓటు వేసే సమయంలో కన్నడ ప్రజల మదిలో ప్రతిధ్వనించాయన్నారు. తమ ఓటు ద్వారా ప్రజలు భాజపా ప్రతీకార రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పడం ద్వారా కన్నడిగులు తమ పౌరుషాన్ని చాటుకున్నారని తెలిపారు. ద్రవిడ ప్రాంతం నుంచి భాజపాను అధికారానికి దూరం చేయగలిగామన్న స్టాలిన్‌.. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అందరం కలిసి గెలుపు కోసం సమష్టిగా పనిచేద్దామంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకుందామన్నారు. 

కర్ణాటక ప్రజల తీర్పునకు సెల్యూట్‌: మమత

మార్పు దిశగా నిర్ణయాత్మక తీర్పు వెలువరించిన కర్ణాటక ప్రజలకు సెల్యూట్‌ అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ‘క్రూరమైన నిరంకుశ రాజకీయాలు ఓడిపోయాయి. ప్రజలు బహుళత్వం, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నప్పుడు.. ఆధిపత్యం చెలాయించే ఏ శక్తి వారిని అణచివేయలేదు. ఇదే రేపటికి గుణపాఠం’ అని పేర్కొన్నారు.

విభజన రాజకీయాలను తిప్పికొట్టారు.. థాంక్స్‌: కేటీఆర్‌

కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలూ తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం నేపథ్యంలో ఆయన  ట్వీట్‌ చేశారు. విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటకవాసులకు థాంక్స్‌ చెప్పారు. హైదరాబాద్‌, బెంగళూరుల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొనాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

మతతత్వ సెంటిమెంట్‌ పనిచేయలేదు.. సీపీఎం

కర్ణాటకలో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలపై కేరళలో అధికార సీపీఎంతో పాటు ఇతర పార్టీలూ స్వాగతించాయి. భాజపా విభజనవాద, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల సెంటిమెంట్‌కు ఈ ఫలితాలు నిదర్శనమని అక్కడి నేతలు పేర్కొన్నారు. కర్ణాటకలో ఓట్ల ట్రెండ్ దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం క్షీణతను కూడా తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. భాజపా పాలన నుంచి కర్ణాటకకు విముక్తి లభించడాన్ని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ స్వాగతించారు. అయితే, కాంగ్రెస్‌ ఒక్కటే భాజపా నుంచి దేశాన్ని విముక్తి చేయలేదన్నారు. ప్రతి రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని భాజపా వ్యతిరేక ఓట్లను ఏకం చేసి ఆ పార్టీని ఓడించాలని.. కర్ణాటకలోనూ అదే పనిచేసిందన్నారు. 

భజరంగ్‌బలి గద భాజపాపై పడింది.. సంజయ్‌ రౌత్‌ వ్యంగ్యాస్త్రం

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శివసేన (ఉద్ధవ్‌బాలాసాహెబ్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. కర్ణాటకలో భాజపా ఓటమి ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్‌షాల ఓటమేనన్నారు. భజరంగ్‌ బలి గద భాజపాపై పడిందంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. కర్ణాటకలో ఫలితాలే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్‌ అవుతాయన్నారు.

JKలో ఎన్నికలకు భాజపా ధైర్యం చేయదు.. ఒమర్‌ అబ్దుల్లా

కర్ణాటక ఫలితాలతో భాజపా ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలను నిర్వహించేందుకు ధైర్యం చేయదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలంటూ భాజపాయేతర పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని