Sanjay Raut: నన్ను చంపించేందుకు సీఎం కుమారుడు సుపారీ.. సంజయ్‌ రౌత్‌ ఆరోపణ

పార్టీ పేరు, గుర్తు (Shiv Sena) కొనుగోలుకు రూ.2వేల కోట్ల డీట్‌ జరిగిందని ఆరోపించిన సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut).. తాజాగా ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఇదే విషయంపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. ఇందుకోసం శిందే కుమారుడు ఓ నేరస్థుడికి సుపారీ (Supari) కూడా ఇచ్చారని ఆరోపించారు.

Published : 21 Feb 2023 20:40 IST

పుణె: శివసేన (Shiv Sena) పార్టీ పేరు, గుర్తు విల్లు-బాణం కొనుగోలు చేసేందుకు రూ.2వేల కోట్ల ఒప్పందం జరిగిందని శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కుమారుడి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తనను చంపేందుకు శిందే కుమారుడు ఓ నేరస్థుడికి సుపారీ (Supari) కూడా ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయంపై ముంబయి పోలీసు కమిషనర్‌కు సంజయ్‌ రౌత్‌ ఫిర్యాదు చేశారు.

‘నన్ను చంపించేందుకు ఠాణెకు చెందిన రాజా ఠాకూర్‌ అనే ఓ నేరస్థుడికి లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ శిందే సుపారీ ఇచ్చారు.  ఈ విషయంపై నాకు విశ్వసనీయ సమాచారం ఉంది. బాధ్యత కలిగిన పౌరుడిగా నేను మీకు సమాచారం ఇస్తున్నాను’ అని ముంబయి పోలీసు కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. అయితే, సంజయ్‌ రౌత్‌ చేసిన ఆరోపణలను శిందే వర్గం ఖండించింది. ఇవి నీచరాజకీయాలని మండిపడింది. మరోవైపు పార్టీ గుర్తు, పేరును సొంతం చేసుకున్న శిందే వర్గం.. పార్టీకి కొత్త అధినేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

పార్టీ పేరు, గుర్తు విల్లు-బాణం కొనుగోలుకు రూ.2 వేల కోట్ల డీల్‌ జరిగిందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆరు నెలలుగా లావాదేవీలు సాగుతున్నాయని, ఆధారాలను త్వరలో బయటపెడతానన్నారు. ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు చేతులు మారాయని, ఇది తక్కువ మొత్తం కాదన్నారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని