Sanjay Raut: శిందే వర్గం నుంచి కొందరు టచ్‌లో ఉన్నారు: రౌత్‌

Sanjay Raut on Shinde group: శిందే వర్గానికి చెందిన కొందరు అసంతృప్తితో ఉన్నారని సంజయ్‌ రౌత్‌ అన్నారు. అందులో కొందరు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

Published : 31 May 2023 18:44 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఉద్ధవ్‌ వర్గానికి చెందిన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) అన్నారు. ఆ పేర్లను ఇప్పుడే బయటపెట్టాలని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. భాజపా వైఖరి పట్ల 22 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నారంటూ ఉద్ధవ్‌ పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో కథనం వచ్చింది. ఏ క్షణంలోనైనా వారు శిందే వర్గాన్ని వీడే అవకాశం ఉందని ఆ కథనం సారాంశం. ఆ మరుసటి రోజే రౌత్‌ విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘శిందే వర్గానికి చెందిన కొందరు నేతలు టచ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు వారితో చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్ధవ్‌ వర్గాన్ని వీడి వారు తప్పు చేశారు. ఇప్పుడు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పుడే వారి పేర్లు చెప్పడం సరికాదు. శిందే వర్గంతో ఉన్నవాళ్లంతా కమలం గుర్తుపై పోటీ చేయాలని భాజపా కోరుకుంటోంది. ఆ సమాచారం మాకుంది’’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు. 2019 ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది శిందే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి భాజపాతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో భాజపా తమ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన ఎంపీ గజానన్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో శిందే వర్గంలో అసంతృప్తి రాజుకుందంటూ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని