Sanjay Raut: మేం అధికారంలోకి వస్తే గోవాలో క్యాసినోలు మూసేస్తాం

వచ్చే ఏడాదిలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు సైతం పోటీలో నిలుస్తుండటంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దిల్లీ, బెంగాల్‌లో అధికారంలో....

Published : 02 Oct 2021 01:29 IST

ఆప్‌, తృణమూల్‌ పోటీతో గోవాలో రాజకీయ వేడుక
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు

పనాజీ: వచ్చే ఏడాదిలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు సైతం పోటీలో నిలుస్తుండటంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దిల్లీ, బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీలు సైతం ఇక్కడ బరిలో నిలుస్తుండటంతో గోవాలో రాజకీయ వేడుక (పొలిటికల్‌ కార్నివాల్‌) వాతావరణం నెలకొందన్నారు. శుక్రవారం గోవా వచ్చిన ఆయన పనాజీలో మీడియాతో మాట్లాడారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 22నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టంచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గోవాలో క్యాసినోలు మూసివేస్తామని ప్రకటించారు. 

‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా గోవాలో పోటీ చేస్తున్నట్టు విన్నా. దిల్లీ, బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ బరిలో దిగుతున్నాయి. అనేకమంది నేతలు పార్టీలు మారుతున్నారు. దీంతో గోవాలో రాజకీయ పండుగ నెలకొంది’’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు. గోవాతో శివసేన పార్టీకి సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గోవాలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు పెట్టుకొనేందుకు అవకాశం ఉందా? అన్న ప్రశ్నలకు స్పందిస్తూ.. గోవాతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయాలు విభిన్నమైనవని తెలిపారు. శివసేన ఒంటరిగా పోటీచేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్లలో ఎలాంటి చీలిక రాదన్న రౌత్‌.. అక్కడ తమకు సొంత బలం ఉందని.. దాంతోనే మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. మహిళా పోలీసు సిబ్బందికి గోవాలో పని గంటలు తగ్గించాలన్న డిమాండ్‌ సహా పలు సమస్యలపై పనిచేస్తున్నట్టు చెప్పారు. 

40 స్థానాలు కలిగిన గోవా అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భాజపా అధికారంలో ఉండగా.. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఫలేయిరో ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. తమ పార్టీ 40 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని నిన్న ప్రకటించారు. మరో వైపు, ఆప్‌ కూడా ఈసారి పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు 80శాతం ఉద్యోగాలు స్థానికులకేనని హామీలు గుప్పిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని