
Politics: వారి వల్లే భాజపా-శివసేన సంబంధాలు నాశనమయ్యాయి: సంజయ్ రౌత్
ముంబయి: కేంద్రమంత్రి నారాయణ్ రాణెను లక్ష్యంగా చేసుకొని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భాజపాలోకి వచ్చి చేరిన కొందరు కొత్త నేతల వల్లే ఇరు పార్టీల మధ్య 25 ఏళ్లకు పైగా ఉన్న మంచి సంబంధాలు చెడిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటి శక్తులను భారతదేశ సామాజిక సామరస్యతకు విఘాతం కలిగించే బంగ్లాదేశీ, పాకిస్థానీ చొరబాటుదారులతో పోల్చారు. భాజపా-శివసేన మధ్య కొన్ని అంశాలపై బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఎన్నడూ సంబంధాలు ఇంతలా చెడిపోలేదన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే ఉన్న సమయంలో భాజపా దిగ్గజ నేతలైన వాజ్‌పేయీ, అడ్వాణీలతో సంబంధాలు ఎంతో బాగుండేవని గుర్తు చేసుకున్నారు. కానీ, గత కొన్నేళ్ల క్రితం భాజపాలో చేరిన కొందరు నేతలు రెండు పార్టీల మధ్య సంబంధాలను నాశనం చేశారని మండిపడ్డారు.
గత 25 ఏళ్లలో తామెన్నడూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం గానీ, సంబంధాలు ఇంతలా చెడిపోవడం గానీ జరగలేదన్నారు. నారాయణ్ రాణె వ్యవహరిస్తున్న తీరు శత్రుత్వాన్ని ప్రదర్శించేలా ఉందన్నారు. శివసేన భాజపాతో కలిసి 25 ఏళ్ల పాటు కలిసి నడిచిన విషయాన్ని గుర్తు చేసుకున్న రౌత్.. ప్రధాని నరేంద్ర మోదీ, ఉద్ధవ్ మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు.
శివసేనతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నారాయణ్ రాణె ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి బయటకు వచ్చేసిన రాణె మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పేరుతో కొత్త పార్టీని స్థాపించి దాన్ని 2019లో దాన్ని భాజపాలో విలీనం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి వర్గ విస్తరణలో కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్నారు.అయితే, ఇటీవల జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించిన రాణె.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలతో మహారాష్ట్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.