Rahul Gandhi: సావర్కర్‌ వివాదం వేళ.. రాహుల్‌పై సంజయ్‌ రౌత్‌ పొగడ్తలు

భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ.. ఆదివారం రౌత్‌కు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో సంతోషపడిన శివసేన ఎంపీ.. ట్విటర్‌ వేదికగా రాహుల్‌ను పొగిడారు.

Updated : 21 Nov 2022 15:04 IST

దిల్లీ: హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను శివసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. దీంతో ఈ పార్టీ మధ్య బంధం తెగిపోనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివసేన సీనియన్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌.. రాహుల్‌పై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ.. ఆదివారం రౌత్‌కు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో సంతోషపడిన శివసేన ఎంపీ.. ట్విటర్‌ వేదికగా రాహుల్‌ను పొగిడారు.

‘‘కొన్ని విషయాల్లో తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో సహ నేతల ఆరోగ్యం పట్ల దృష్టిపెట్టడం.. వారి గురించి తెలుసుకోవడం మానవత్వానికి చిహ్నం. భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ రాహుల్‌ జీ నిన్న నాకు ఫోన్‌ చేసి  పరామర్శించారు. ‘మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాం’ అని చెప్పారు. 110 రోజుల పాటు జైల్లో గడిపి వచ్చిన ఓ రాజకీయ నేత బాధలను తెలుసుకుని ఆయన పరామర్శించడం అభినందనీయం. రాజకీయ సమరంలో ఇలాంటివి చాలా అరుదు. రాహుల్‌జీ తన యాత్రలో ప్రేమాభిమానాలపైనే దృష్టిపెట్టారు. అందుకే ఆయనకు భారీ మద్దతు లభిస్తోంది’’ అంటూ రౌత్‌ రాసుకొచ్చారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత శివసేన అధికార పత్రిక సామ్నాలో రాహుల్‌ వ్యాఖ్యలను విమర్శిస్తూ సంజయ్‌ రౌత్‌ సంపాదకీయం రాశారు. దీంతో మహావికాస్‌ అఘాడీలో కాంగ్రెస్‌-శివసేన బంధం తెగిపోతుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా రాహుల్‌ ఫోన్‌కాల్‌.. రౌత్‌ ప్రశంసలు వీరి పొత్తు కొనసాగనుందనే సంకేతాలిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు