శశికళ దారెటు?  

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. దానికి పోటీగా మరోసారి అధికార పీఠంలో కొలువుదీరాలని అన్నాడీఎంకే  పోరాడుతోంది. ........

Updated : 21 Feb 2021 04:22 IST

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని డీఎంకే  తీవ్రంగా శ్రమిస్తోంది. దానికి పోటీగా మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని అన్నాడీఎంకే  వ్యూహాలు పన్నుతోంది. ఈ తరుణంలో జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి తిరిగి వచ్చిన శశికళ పైనే అందరి దృష్టి. ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేళ్లు నిషేధం ఉండటంతో ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది. పైగా తనని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి తన సీఎం కోరికకు అడ్డుతగిలిన పళనిస్వామి, పన్నీర్‌ సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? తన మేనల్లుడి స్థాపించిన కొత్త పార్టీలోకి వెళ్తారో అంతుబట్టడంలేదు.

ఏమని శపథం చేశారో గానీ!
అక్రమాస్తుల కేసుల కేసులో శశికళ జైలుకు వెళ్లడానికి ముందు ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటివరకు జయలలితతో సమానంగా ఆమె ఎంత చెబితే అంత అన్నట్టు ఉన్న నేతలే ఆమె అధికారానికి ఎదురు తిరిగారు. సీఎం పీఠం ఎక్కేందుకు వీల్లేదంటూ అడ్డుతగిలారు. అనంతరం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ సందర్భంలోనే జైలు శిక్ష తప్పించుకొనే మార్గం కనబడక కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలుకు బయల్దేరిన ఆమె.. వెళ్తూ వెళ్తూ జయలలిత సమాధి వద్ద శపథం చేసి వెళ్లారు. ఆ దృశ్యాలు తమిళనాటే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ ఎంతో సంచలనం సృష్టించాయి. అక్కడ ఆమె ఏమని శపథం చేశారో ఎవరికీ తెలియకపోయినా ఏదో ఒకరోజు సీఎంగా అక్కడికి వస్తానని ప్రమాణం చేసినట్టు ఆమె సన్నిహితులు చెబుతారు. 

రాకతోనే సంచలనాలు!
మొత్తమ్మీద నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత తమిళనాడులో అడుగుపెడుతూ ఎన్నో సంచలనాలు సృష్టించారు శశికళ. తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉంచి ప్రయాణం చేశారు. పార్టీ నేతలు వద్దని పోలీసులకు ఫిర్యాదు చేసినా చిన్నమ్మ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జయలలితను గుర్తుకు తెచ్చేలా ఆకుపచ్చ చీరలో దర్శనమిచ్చి తమిళ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వస్తూ వస్తూనే తానూ ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. దారిపొడవునా అభిమానులు, పార్టీ నాయకులతో చర్చిస్తూ ప్రయాణం సాగించారు. దారిలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసి రాష్ట్రంలోకి ఆహ్వానించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ఎన్నికలకు ఎలా వ్యవహరిస్తారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో పోటీచేయకుండా ఇంకా ఆరేళ్ల పాటు నిషేధం ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. వాటిలో శశికళ అన్నాడీఎంకేకు మద్దతు తెలుపుతారని కొందరు వాదిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆమె ఆ పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పార్టీ నేతలు సైతం ఆమె పార్టీలోకి తిరిగి వస్తే తమ స్థానాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందుకే ఆమెకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు.

రెండాకుల గుర్తు కోసం పోరాటం 
శశికళ కూడా అన్నాడీఎంకే ప్రస్తుత నేతలపై పలు రకాలుగా పోరాడుతున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం కంటే జయలలిత ప్రాతినిధ్యం వహించిన పార్టీనే చేజెక్కించుకుంటే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అన్నాడీఎంకే ఎన్నికల గుర్తుగా  రెండు ఆకుల గుర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గుర్తును తనకు కేటాయించాలని ఈసీ, కోర్టులో ఫిర్యాదు చేశారు. ఒకవేళ అక్కడ శశికళకు అనుకూలంగా తీర్పు వస్తే ఇక పార్టీ  ఆమె చేతుల్లోకి వెళ్లినట్టే.

మేనల్లుడికి మద్దతు ఇస్తారా?
ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు కనిపిస్తున్న మార్గం తన మేనల్లుడు దినకరన్‌ స్థాపించిన పార్టీకి మద్దతు ప్రకటించడం. కానీ ఓ వైపు రెండాకుల గుర్తు కోసం పోటీ పడుతూ దినకరన్‌కు మద్దతు తెలిపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇద్దరు కీలక నేతలుగా ఉన్న పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంల మధ్య విభేదాలు సృష్టించి ఒకరిని తనవైపు లాక్కొనే ప్రయత్నాలు చేయొచ్చని భావిస్తున్నారు.

కొత్త ఉత్సాహంతో భాజపా..

ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి సానుకూల ఫలితాలే వచ్చాయి. మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహాలు ఆ పార్టీని విజయతీరాలకు చేర్చాయి. అయితే ఉత్తరాదిన జైత్రయాత్ర చేసిన భాజపా దక్షిణాదిన మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా తమిళనాట ప్రభావం చూపలేకపోతోంది. అధికార పార్టీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ పూర్తిస్థాయి లక్ష్యాలు సాధించలేకపోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కల సాకారం కావాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కానీ అధికార పార్టీతో ఇటీవల విభేదాలు తలెత్తడం భాజపాకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

జాతీయ వాదమే నినాదంగా భాజపా ముందుకు సాగుతోంది. ఈ అజెండాతోనే ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ విజయం సాధించింది. అయితే దక్షిణాదిలో కీలకమైన తమిళనాట మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకొని మెళ్లగా రాష్ట్ర రాజకీయాల్లోకైతే అడుగుపెట్టింది. ఇప్పుడు ఉనికి విస్తరించుకొనే పనిలో పడింది. అయితే హిందీ భాష నేపథ్యం ఉండటం ఈ పార్టీ తమళనాట ప్రభావం చూపలేకపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఈ సవాలునూ అధిగమిస్తూ ముందుకుసాగే ప్రయత్నాలు చేస్తోంది. 2016లో జయలలిత మరణం తరువాత అధికార పార్టీకి చేరువై పన్నీర్‌సెల్వంను పక్కనబెట్టి పళనిస్వామికి దగ్గరైంది. ఈ క్రమంలో బడా అధికారుల ఇళ్లల్లో సోదాలు వారందరినీ పరుగులు పెట్టించాయి. ఈ పరిణామంతో అన్నా డీఎంకే తప్పనిసరిగా భాజపాతో చేతులు కలపాల్సి వచ్చిందని అంటారు. 

అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేసినా చేదు ఫలితాలే వచ్చాయి. తరువాత 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడీఎంకే ఒంటరిగా పోటీ చేయగా వాటిలో 9 చోట్ల విజయం సాధించింది. ఇది భాజపాను గందరగోళంలోకి నెట్టేసింది. కానీ తమిళనాట పాగా వెయ్యాలనే ప్రయత్నాలను మాత్రం ఆపడంలేదు కాషాయ పార్టీ. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 2.86 శాతం ఓట్లు మేర ఓట్లు సాధించగలిగింది. ఆ సమయంలో డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంకు వచ్చిన ఓట్లు కన్నా ఇవి ఎక్కువే. ఈ పరిణామం భాజపాలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. రానున్న ఎన్నికల్లో 5 నుంచి 10 స్థానాల్లో తమ ప్రాబల్యం చాటుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని