AIADMK: ‘చిన్నమ్మ’ నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చేమో కానీ.. పార్టీలో మాత్రం చోటులేదు!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అన్నాడీఎంకే ......

Updated : 17 Oct 2021 09:18 IST

మాజీ మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అన్నాడీఎంకే స్పందించింది. ఆమెకు తమ పార్టీలో స్థానంలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డి.జయకుమార్‌ మాట్లాడుతూ.. శశికళ ‘అమ్మ’ స్మారకం వద్దకు వచ్చినంత మాత్రాన రాజకీయ ప్రభావమేమీ ఉండదన్నారు. జయలలిత వల్ల లబ్ధి పొందినవారిలో ఆమె కూడా ఒకరన్నారు. ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఏఎంఎంకే సరైన వేదిక అని చెప్పారు. జయలలిత స్మారకం వద్ద శశికళ నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చేమో గానీ తమ పార్టీలో మాత్రం ఆమెకు చోటులేదని తేల్చి చెప్పారు. గతంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ఆ పార్టీనుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

‘అమ్మ’ స్మారకం వద్ద చిన్నమ్మ కంటతడి

మరోవైపు, శశికళ రాజకీయ జీవితంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆమె మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. శనివారం భారీ సంఖ్యలో అభిమానుల మధ్య జయలలిత స్మారకం వద్ద నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ‘అమ్మ’ స్మారకాన్ని దర్శించుకొని పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన శశికళ.. కంటతడి పెట్టుకున్నారు. శశికళ అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో జయలలిత స్మారకం వద్దకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు సైతం అన్నాడీఎంకే జెండాలే పట్టుకొని కనిపించారు.

నా మనసులో భారమంతా జయలలిత సమాధి వద్ద దించేశా!

ఈ సందర్భంగా బీచ్‌ వద్ద శశికళ విలేకర్లతో మాట్లాడుతూ..  ‘‘నా జీవితంలో ఎక్కువ భాగం జయలలితతోనే ఉన్నాను. నాలుగేళ్లుగా స్మారకం వద్దకు వస్తున్నాను. అన్నాడీఎంకే పార్టీని, కార్యకర్తల్ని ఎంజీఆర్‌, జయలలితే కాపాడతారనే విశ్వాసం నాకు ఉంది. నా మనసులోని భారాన్ని జయలలిత సమాధి వద్ద దించేశా. ఎంజీఆర్‌, జయ తమిళనాడు ప్రజల కోసమే జీవించారు. వారిద్దరూ కార్యకర్తలను కాపాడతారు’’ అని అన్నారు. అయితే, ఆమె తన రాజకీయ జీవితాన్ని పునఃప్రారంభించే ఉద్దేశమే ఈ పరిణామానికి కారణమని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా తాను అధికారంలో, పదవిలో లేనన్న శశికళ.. అన్నాడీఎంకే బంగారు పాలనను కొనసాగించేందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ఈ ఏడాదిలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయంపాలవ్వగా.. ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని