Politics: శశికళ 1000 మందితో మాట్లాడినా..!

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలతో మాట్లాడటంపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ సీఎం పళనిస్వామి......

Published : 01 Jul 2021 01:22 IST

అన్నాడీఎంకేకు నష్టం లేదన్న పళనిస్వామి

సేలం: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలతో మాట్లాడటంపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు. ఆమె ఫోన్‌లో సంభాషించడం ద్వారా కోటిన్నర క్యాడర్‌తో బలంగా ఉన్న తమ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. 2017లో పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుంచి శశికళకు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కొంత మందితో మాట్లాడుతూ ఆమె ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ‘‘శశికళ అన్నాడీఎంకేతో లేరు. పార్టీతో కాంటాక్ట్‌లో లేరు. అందువల్ల కేవలం 10 మందితోనే కాదు 1000 మందితో మాట్లాడినా కోటిన్నర మంది క్యాడర్‌తో బలంగా ఉన్న అన్నాడీఎంకేపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని విలేకర్లతో అన్నారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తర్వాత శశికళ పార్టీ క్యాడర్‌తో ఫోన్‌లో సంభాషించిన ఆడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాను మళ్లీ పార్టీలోకి వస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ఆమె వ్యాఖ్యానించినట్టుగా ఆ టేపుల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో తనతో సంభాషించిన కొందరు పార్టీ నేతలపై అన్నాడీఎంకే నాయకత్వం బహిష్కరణ వేటు వేయడాన్ని కూడా శశికళ తప్పుబట్టారు.

నీట్‌పై గందరగోళం తొలగించండి..

మరోవైపు, శశికళ వ్యవహారాన్ని మీడియా పెద్దగా చూపిస్తోందని పళనిస్వామి అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరతతో పాటు నిర్మాణ రంగం పరికరాల ధరల పెరుగుదల, ఇంధన ధరలు, నీట్‌ తదితర తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నారు. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.4ల చొప్పున తగ్గించడం సహా ఎన్నికల్లో 505 హామీలు ఇచ్చిన డీఎంకే వాటిని అమలు చేయడంలేదని విమర్శించారు. తప్పుడు హామీలతో డీఎంకే అధికారంలోకి వచ్చిందని ఆక్షేపించారు. నీట్‌ పరీక్షలు నిర్వహిస్తారో లేదో స్పష్టంగా చెప్పి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని