Gujarat polls: మోదీ-షా ఖిల్లాలో తొలి ఫైట్‌ నేడే.. గుజరాత్‌ ఓటరు గురి ఎటువైపో?

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికల(Gujarat Election)కు వేళైంది. తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రచార హోరు నిన్నటితో ముగియడంతో డిసెంబర్‌ 1న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

Published : 01 Dec 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికల(Gujarat Election)కు వేళైంది. తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రచార హోరు నిన్నటితో ముగియడంతో డిసెంబర్‌ 1న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మోదీ-షా ఖిల్లా అయిన గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కాషాయ జెండాను ఎగురవేయాలని భాజపా సర్వశక్తుల్ని ధారపోయగా.. ఈసారి కమలం కంచుకోటను బద్దలుకొట్టి పునర్‌ వైభవం చాటుకోవాలన్న కసితో కాంగ్రెస్‌ శ్రేణులు అహర్నిశలూ శ్రమించాయి. మరోవైపు, చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆప్‌.. పంజాబ్‌లో విజయోత్సాహంతో గుజరాత్‌ ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శించింది. దీంతో ఇప్పటివరకు గుజరాత్‌లో కేవలం భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా..  తాజాగా ఆప్‌ పూర్తిస్థాయి అరంగేట్రంతో జరుగుతున్న తొలి విడత ముక్కోణపు ఫైట్‌లో దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర, కచ్‌ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.  

గెలుపే టార్గెట్‌..  భాజపా పక్కా స్ట్రాటజీ.. 

గుజరాత్‌ ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలూ పక్కా వ్యూహాలతో ప్రచారం చేశాయి. ప్రజల్ని తమ వైపు ఆకర్షించేందుకు హామీల జల్లు కురిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా రాజకీయ చాణక్యుడు అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడం, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళ ఇక్కడ గెలుపు భాజపాకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో కమలనాథులు గుజరాత్‌లో గతంలో కన్నా అధిక సీట్లు, ఓట్లు సాధించి రికార్డు స్థాయి గెలుపే లక్ష్యంగా పదునైన వ్యూహాలు అనుసరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడగట్టి లక్ష్యాన్ని సాధించాలని విపక్షాలు పోటీ పడుతుంటే ఇప్పటివరకూ తమకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంపై భాజపా ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలతో రూ.లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా.. హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వంటి హేమాహేమీలు ప్రచారంతో హోరెత్తించారు.

ఆప్‌ ‘దిల్లీ మోడల్‌’.. కాంగ్రెస్‌ ‘KHAM’ వ్యూహం ఫలిస్తుందా?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉన్నందున ఈ ఎన్నికల ప్రచారానికి పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోయినప్పటికీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వంటి జాతీయస్థాయి నేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఆకర్షణీయ హామీలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్‌ సామాజిక సమీకరణాల ఆధారంగా రచించిన ‘KHAM’ (క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ,ముస్లిం) వ్యూహంపై  ఈ ఎన్నికల్లో ఆశలు పెట్టుకుంది. తద్వారా గణనీయమైన ఓట్లు, సీట్లు రాబెట్టుకోవచ్చని భావిస్తోంది. అలాగే, ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ విస్తృత పర్యటనలతో వినూత్న హామీలతో ప్రజల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. దిల్లీ మోడల్‌ పాలన చూపించి గుజరాత్‌ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌, ఆప్‌లు ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీని విమర్శిస్తూనే ఇరు పార్టీలూ పరస్పరం ఆరోపణలు సంధించుకున్నాయి. ‘భాజపా..బి- టీమ్‌ ఆప్‌’ అని హస్తం పార్టీ విమర్శించగా.. ‘కమలం...హస్తం మధ్య ఐఎల్‌యు(ఐ లవ్‌ యు) ఒప్పందం ఉందని, గుజరాత్‌లో తమను తొక్కేసేందుకే ఆ రెండు పెద్ద పార్టీలు కుమ్మక్కయ్యాయంటూ ఆప్‌ నేతలు పేర్కొన్నారు. ఒక విధంగా కాంగ్రెస్‌, ఆప్‌ జనాకర్షక హామీలు భాజపాను కొంత ఆందోళనలోకి నెట్టాయనే చెప్పాలి. కానీ, తాము చేసిన అభివృద్ధి, మోదీ ఇమేజ్‌ తమను గెలిపిస్తాయన్న విశ్వాసంతో కమలనాథులు ఉన్నారు. అంతేకాకుండా ఈసారి త్రిముఖ పోటీ ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే మేలు చేస్తుందని విశ్వసిస్తున్నారు. 

మజ్లిస్‌ పోటీతో కలిసొచ్చేది ఎవరికి?

అభివృద్ధి, హిందుత్వ నినాదం, మోదీ నాయకత్వం భాజపా ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పాటీదార్లు, ఆదివాసీలు, దళితులను తన వైపు తిప్పుకొనే వ్యూహాన్ని కమలనాథులు అమలుచేస్తున్నారు. దీనికి పోటీగా ఆప్‌ మిశ్రమ వ్యూహాన్ని అమలుచేస్తోంది. వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు హిందుత్వవాదుల్లో సానుకూల అభిప్రాయాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. కరెన్సీ నోట్లపై గణేశ్‌, లక్ష్మీ దేవి చిత్రాలను ముద్రించాలని ప్రధాని మోదీకి లేఖరాయడం దీనిలో భాగమే. ఓబీసీలు, ఆదివాసీలు, హిందూ జాట్‌లు, ముస్లింల ఓట్లను సంఘటితం చేసుకోవడం ద్వారా 1985లో మాధవ్‌సింహ్‌ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో 149 స్థానాలను దక్కించుకుంది. నరేంద్ర మోదీ హవా కొనసాగిన సమయంలోనూ భాజపా అత్యధికంగా సాధించిన అసెంబ్లీ స్థానాలు 127 మాత్రమే. ఇప్పుడు ఆప్‌ కూడా 1985నాటి కాంగ్రెస్‌ తరహా సమీకరణను సాధించాలని ప్రయత్నిస్తోంది. దానికి అదనంగా హిందుత్వవాదుల ఓట్లు పొందాలని చూస్తోంది. ముస్లింలు బలంగా ఉన్న ప్రాంతాల్లో అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఎంఐఎం పోటీ చేయడం ఈసారి భాజపాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వర్గం ఓట్లు కాంగ్రెస్‌, ఆప్‌, ఎంఐఎంల మధ్య చీలిపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అధికంగా నష్టపోనుంది. వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ మరణించడం హస్తం పార్టీకి తీరని లోటు. ఆ నష్టాన్ని భర్తీ చేసే నేత మరొకరు ఆ పార్టీలో లేరు. కమలం పార్టీకి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో ఆప్‌కు ఆదరణ కనిపిస్తున్నందున అక్కడి ఓట్లలో చీలిక తమకు లబ్ధి కలిగిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ గుజరాత్‌, కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల పరిధిలోని 89 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారో చూడాలి. 

తొలి విడత పోలింగ్‌.. కొన్ని కీలకాంశాలు.. 

  • దక్షిణ గుజరాత్‌, కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల పరిధిలోని 89 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 788 మంది బరిలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా సంప్రదాయంగా అన్ని స్థానాల నుంచి తమ అభ్యర్థుల్ని బరిలోకి దించగా ఆప్‌ నుంచి 88మంది బరిలో ఉన్నారు.
  • బీఎస్పీ 57మందిని బరిలో దించగా.. బీటీపీ 14, ఎంఐఎం 6, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 100, స్వతంత్రులు 338 మంది పోటీ చేస్తున్నారు.
  • తొలి విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గాఢ్వీ ఖంబాలియా సీటు నుంచి పోటీ బరిలో నిలుస్తున్నారు. అలాగే, మాజీ మంత్రి పురుషోత్తం సోలంకి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కున్వార్జి బవలియా, మోర్బి ‘హీరో’ కాంతిలాల్‌ అమృతీయ, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ఆప్‌ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా వంటి ప్రముఖులు పోటీచేస్తున్న స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది.
  • ఈ విడత జరిగే ఎన్నికల్లో భాజపా నుంచి 9మంది మహిళలు బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, ఆప్‌ నుంచి ఐదుగురు మహిళలు పోటీ చేస్తున్నారు.
  • ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన విరాల ప్రకారం తొలి దశలో మొత్తం 2,39,76,670మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362మంది పురుషులు కాగా.. 1,15,42,811మంది మహిళా ఓటర్లు, 497మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. గుజరాత్‌లో మొత్తంగా 4.90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 
  • ఈ ఎన్నికల పోలింగ్‌కు 25,434 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 9,018 అర్బన్‌ ప్రాంతాల్లో, 16,416 పోలింగ్‌ బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ విడతలో 34,324 బ్యాలెట్‌ యూనిట్లు, 34,324 కంట్రోల్‌ యూనిట్లు, 38,749 వీవీప్యాట్‌లను వినియోగించనున్నట్టు తెలిపిన అధికారులు.. పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించినట్టు తెలిపారు.
  • గుజరాత్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత బరిలో నిలిచిన 788 మంది అభ్యర్థుల్లో 166 మంది (21 శాతం)కి నేర చరిత్ర ఉన్నట్టు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. అందులో 100 మందిపై (13శాతం) తీవ్రనేరాలైన హత్య, మానభంగాలు, కిడ్నాప్‌ లాంటి అభియోగాలున్నాయి. 
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 88 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలపగా.. వారిలో 36శాతం మందిపై (32) క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 26 మంది తీవ్రనేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి.
  • కాంగ్రెస్‌ పార్టీ 89 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీ అభ్యర్థుల్లో 35శాతం (31) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 18 మందిపై తీవ్ర నేరాభియోగాలున్నాయి.
  • అధికారపక్షమైన భాజపా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఈ పార్టీ అభ్యర్థుల్లో 14 మందికి (16శాతం) నేర చరిత్ర ఉంది. వీరిలో 11 మందిపై తీవ్రనేరాలకు పాల్పడినట్లుగా కేసులున్నాయి.
  • భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) 14 స్థానాలకు పోటీ చేస్తోంది. నలుగురు అభ్యర్థులు వివిధ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి.
  • గుజరాత్‌ శాసనసభకు 2017లో (తొలి విడతలో) పోటీ చేసిన అభ్యర్థుల్లో 15శాతం మందిపై క్రిమినల్‌ కేసులుంటే ఈ సారి అది 21 శాతానికి పెరగడం గమనార్హం.
  • తొలి దశలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 211 మంది(27శాతం) కోటీశ్వరులే. వీరిలో అత్యధికంగా 79 మంది భాజపాకు చెందినవారే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 65 మంది, ఆప్‌ తరఫున 33 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. 
  • రాజ్‌కోట్‌ దక్షిణ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి రాజేశ్‌ తిలాలా రూ.175 కోట్ల ఆస్తితో అందరికన్నా సంపన్నుడిగా నిలవగా.. రాజ్‌కోట్‌ పశ్చిమ సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా తనకు నయా పైసా ఆస్తి కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని