
uttar pradesh: జిన్నాపై పొగడ్తలు.. మొన్న ఎస్పీ.. నేడు ఎస్బీఎస్పీ!
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. ఇటీవల పాకిస్థాన్ వ్యవస్థాపకుడు, పాక్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నాను స్వాతంత్య్ర సమరయోధుడంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అఖిలేశ్ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు మండిపడ్డాయి. కాగా.. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్, పాకిస్థాన్ విభజన కాకపోయి ఉంటే.. జిన్నా భారత తొలి ప్రధాన మంత్రి అయ్యేవాడని అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అడ్వాణీకి కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండేదని వెల్లడించారు. ఆ అభిప్రాయమే లేకపోతే జిన్నాను ఎందుకు కొనియాడుతారని రాజ్‌భర్ ప్రశ్నించారు.
ఎస్బీఎస్పీ అధినేత రాజ్‌భర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. రాబోయే ఎన్నికల కోసం కొన్ని వర్గాలను బుజ్జగించే ప్రయత్నం ప్రారంభించారని, అందులో భాగంగానే జిన్నా పేరును జపిస్తున్నారని మండిపడ్డారు.