Adani-Hindenburg: ‘సుప్రీం’ తీర్పు మోదీ సర్కార్‌కు చెంపపెట్టు: ఆప్‌

అదానీ(Adani)ని కాపాడేందుకు ప్రధాని మోదీ(PM Modi) ఎంతవరకైనా వెళ్లొచ్చన్నారు ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌. అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయడంపై ఆయన స్పందించారు. 

Updated : 03 Mar 2023 01:14 IST

దిల్లీ: అదానీ (Adani)-హిండెన్‌బర్గ్‌ (Hindenburg) వ్యవహారంపై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆప్‌ స్పందించింది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనంతో సహా స్టాక్‌ మార్కెట్లలో రెగ్యులేటరీ అంశాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం మోదీ సర్కార్‌కు చెంపపెట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామంతో మోదీ ప్రభుత్వ అవినీతి రుజువైందని ఆరోపించారు. అదానీని కాపాడేందుకు ప్రధాని ఎంతవరకైనా వెళ్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయాలని పట్టుబడుతున్నా.. మోదీ సర్కార్‌ మాత్రం అందుకు అంగీకరించడంలేదని విమర్శించారు. అందువల్లే చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సంజయ్‌ సింగ్ అన్నారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం.. ఆ కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. ప్రస్తుత కమిటీకి సప్రే నాయకత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ ఓపీ భట్‌, జేపీ దేవదత్‌, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్‌, సోమశేఖరన్‌ సుందరేశన్‌ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) ప్రస్తుతం కొనసాగుతోన్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్‌ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని