Rahul Gandhi: వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్‌కు కేంద్రమంత్రి సింధియా చురక!

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్‌ పార్టీ.. గుజరాత్‌లో గెలుస్తామని పగటి కలలు కంటోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎద్దేవా చేశారు.

Published : 08 Jul 2024 00:07 IST

గాంధీనగర్: గుజరాత్‌ పర్యటనలో భాగంగా అధికార భాజపా (BJP)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పెద్దఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయోధ్యలో (ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఆ పార్టీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పందిస్తూ.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవని పార్టీ.. పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.

‘‘ఇక్కడ చాలా మంది పగటి కలలు కంటున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. భాజపాతో నేరుగా తలపడిన చోట్ల కేవలం 26 శాతం మాత్రమే సానుకూల ఫలితాలు సాధించింది. ఓటర్లు వరుసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ, ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదు. ప్రజాతీర్పును శిరసావహించడం లేదు. అసహనం ప్రదర్శిస్తున్నారు. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాస్తవాన్ని గుర్తించాలి. ఆ తర్వాతే వ్యాఖ్యలు చేయాలి’’ అని పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి సింధియా చురకలంటించారు.

‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్‌ ఆరోపణ

‘‘కొద్దిరోజుల క్రితం ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి భాజపా సవాల్‌ విసిరింది. వారు ఎలా కొట్టారో మనమంతా కలిసి వారి ప్రభుత్వాన్ని అలాగే కొట్టబోతున్నాం. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది, మోదీని, భాజపాని ఓడిస్తుంది. ఈ రాష్ట్రం నుంచే కొత్త శకాన్ని ప్రారంభిస్తుంది. భయపడకుండా ప్రజలు పోరాడితే భాజపా నిలబడడం కష్టమే’’ అని అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి రాహుల్‌ శనివారం ప్రసంగించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని