Ashok Gehlot: గహ్లోత్‌ లీడర్‌ వసుంధర రాజెనా.. సోనియాగాంధీ కాదా..?: పైలట్‌ ధ్వజం

వసుంధర రాజెను ప్రశంసిస్తూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) మండిపడ్డారు. ఎన్నికల వేళ ఆయన మాటలు పార్టీకి చేటుగా మారుతున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

Updated : 09 May 2023 19:05 IST

జైపుర్‌: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Rajasthan Congress)లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot).. భాజపా (BJP) నాయకురాలు వసుంధర రాజెపై ప్రశంసలు కురిపించడం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot).. గహ్లోత్‌పై బహిరంగంగానే విమర్శల దాడికి దిగారు. చూస్తుంటే.. సీఎం బాస్‌ సోనియా గాంధీ కాదని, భాజపా వసుంధర రాజెనే ఆయన తన నాయకురాలిగా భావిస్తున్నారని దుయ్యబట్టారు.

ధోల్‌పుర్‌లో గత ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం అశోక్‌ గహ్లోత్ (Ashok Gehlot) మాట్లాడుతూ.. 2020లో తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజె (Vasundhara Raje) ఆదుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వీటిపై సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) మంగళవారం స్పందిస్తూ.. ‘‘సీఎం ప్రసంగం వింటుంటే.. ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదేమో.. వసుంధర రాజెనేమో అని అన్పిస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. అదే సమయంలో భాజపా నాయకురాలే తన సర్కారు పడిపోకుండా ఆదుకున్నారని చెబుతున్నారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలనే గహ్లోత్ అవమానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయి’’ అని మండిపడ్డారు.

వసుంధర రాజె హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని తాను ఎన్నిసార్లు అభ్యర్థించినా గహ్లోత్‌ (Ashok Gehlot) ఎందుకు చర్యలు తీసుకోలేదో తనకు ఇప్పుడు అర్థమైందని పైలట్ దుయ్యబట్టారు. భాజపా నేతలతో ఉన్న రహస్య బంధం కారణంగా ఆ అవినీతిపై దర్యాప్తునకు సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘‘గత రెండేళ్లుగా గహ్లోత్‌ వర్గం నుంచి నేను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా. పార్టీలో నాయకత్వ మార్పు కోరుకున్నందుకు నన్ను ద్రోహిగా చిత్రీకరించారు. అయినా నేను ఏమీ చెప్పలేదు. పార్టీకి నష్టం కలిగించడం నాకిష్టం లేదు’’ అని పైలట్‌ వివరించారు.

2020 జులైలో అప్పటి ఉపముఖ్యమంత్రి పైలట్‌, మరో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సుమారు నెలపాటు సాగిన ఆ సంక్షోభానికి అధిష్ఠానం జోక్యంతో తెరపడింది. ఆ ఘటనతో పైలట్‌ (Sachin Pilot)ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు. ఆ పరిణామాలపై సీఎం ఇటీవల స్పందిస్తూ.. ఆ సమయంలో వసుంధర రాజె సహా కొందరు భాజపా నేతలు తనకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను రాజె ఖండించారు. ఆయన మాటలు కుట్రపూరితంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రాజె హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల పైలట్‌ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని