‘మీ జాతకాలు మా దగ్గర ఉన్నాయ్‌.. జాగ్రత్త!’.. కేంద్రమంత్రికి రౌత్‌ వార్నింగ్‌!!

మహారాష్ట్రలో శివసేన, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. భాజపా నేత, కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే చేసిన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 20 Feb 2022 05:38 IST

ముంబయి: మహారాష్ట్రలో శివసేన, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. భాజపా నేత, కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే చేసిన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు జాగ్రత్త!’ అంటూ హెచ్చరించారు.

ఉద్ధవ్‌ ఠాక్రే వ్యక్తిగత నివాసం అయిన మాతోశ్రీ భవనంలోని నలుగురు వ్యక్తుల (ఠాక్రే కుటుంబం)కు త్వరలో ఈడీ నోటీసులు పంపించబోతోదంటూ ఇటీవల రాణే వ్యాఖ్యానించారు. దీనిపై రౌత్‌ తాజాగా స్పందించారు. ‘మీరు కేంద్రమంత్రి అయ్యి ఉండొచ్చు. కానీ, ఇది మహారాష్ట్ర అన్న సంగతి మరిచిపోకండి. మేం మీకు బాప్‌. దీని అర్థమేంటో తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. మా జాతకం మీ దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు. మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న సంగతి మరిచిపోవద్దు. జాగ్రత్త!’’ అని రౌత్‌ హెచ్చరించారు.

భాజపా ఎంపీ కిరీట్‌ సోమయ్యపైనా రౌత్‌ విమర్శలు గుప్పించారు. శివసేన నాయకుల అవినీతి గురించి పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు త్వరలో ఇవ్వబోతున్నానంటూ కిరీట్‌ సోమయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై రౌత్‌ స్పందిస్తూ ‘‘మీరు ఆ పత్రాలను కేంద్రానికి ఇవ్వండి. మేం మీవి ఇస్తాం. మీ బెదిరింపులకు మేం భయపడం’’ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఇతరుల సంగతి పక్కన పెట్టి.. ముందు ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వండి అంటూ పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ రౌత్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని