Published : 05 Dec 2021 02:06 IST

కాంగ్రెస్‌లో ఎదిగినవారే దాన్ని ముంచాలనుకుంటున్నారు: శివసేన

ముంబయి: కాంగ్రెస్‌పై ఇటీవల విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై శివసేన పెదవి విరిచింది. కాంగ్రెస్‌ పార్టీని కాదని కేంద్రంలో యూపీఏకి ప్రత్యామ్నాయంగా మరో కూటమిని తీసుకురావడం భాజపాకు మేలు చేయడమే అవుతుందని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో శనివారం సంపాదకీయం రాసింది. 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిని వద్దనుకునేవారు ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని శివసేన తెలిపింది. పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించొద్దని కోరింది. విపక్షాల్లో ఐక్యత లేనట్లయితే, భాజపాకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంపై మాట్లాడడం మానుకోవాలని హితవు పలికింది. మమత ఇటీవల ముంబయిలో శరద్‌ పవార్‌ సహా కొంత మంది కీలక నేతలను కలిసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించారు. ‘యూపీఏనా! అదెక్కడుంది?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు శుక్రవారం ఆ పార్టీ పత్రిక ‘జాగో బంగ్లా’లో కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శివసేన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘కాంగ్రెస్‌ను ఓడించడమే ప్రధాని మోదీ, భాజపా అజెండా. కానీ, మోదీ, భాజపాను వ్యతిరేకించే వారు కూడా కాంగ్రెస్‌ను ఓడించాలని భావిస్తే అది పెద్ద ప్రమాదం. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ పార్టీ వైభవాన్ని కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే, దాన్ని మరింత ముంచి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూడడం మాత్రం సమంజసం కాదు’’ అని సామ్నాలో శివసేన అభిప్రాయపడింది.

‘ప్రతిపక్షాల నాయకత్వం కాంగ్రెస్‌ దైవదత్త హక్కేమీ కాదు’ అని వ్యాఖ్యానించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌నూ శివసేన తప్పుబట్టింది. ఎవరికీ దైవదత్త హక్కులు ఉండవని వ్యాఖ్యానించింది. గతంలో భాజాపాపై వచ్చిన కొన్ని విమర్శల్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. శాశ్వతంగా ప్రతిపక్ష హోదాలో ఉండేందుకే కమలం పార్టీ పుట్టిందంటూ పలువురు విమర్శలు చేశారని తెలిపింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ఏ స్థాయికి ఎదిగిందో గమనించాలని పేర్కొంది. పరోక్షంగా కాంగ్రెస్‌కూ పునర్‌వైభవం వస్తుందని చెప్పకనే చెప్పింది. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగినవాళ్లే ఇప్పుడు ఆ పార్టీని ముంచాలనుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. 

ఈ పరిణామాలపై సోనియా, రాహుల్‌ నోరు విప్పాలని శివసేన సూచించింది. యూపీఏపై వారి ప్రణాళికలేంటో వివరించాలని కోరింది. ఇతర పార్టీలకు కాంగ్రెస్‌తో విభేదాలున్నప్పటికీ.. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే యూపీఏ కూటమి మనుగడ సాధ్యమేనని వ్యాఖ్యానించింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని