Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్‌.. మరో ఎమ్మెల్యే రాజీనామా!

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ జేడీఎస్‌ను మరో ఎమ్మెల్యే వీడారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్‌ ఎమ్మెల్యే రామస్వామి ప్రకటించారు.

Published : 31 Mar 2023 21:24 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly elections) నగరా మోగిన నేపథ్యంలో జేడీఎస్‌(JDS)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఎ.టి. రామస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను విధాన సౌధలో స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో..  అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అందజేశారు.  అయితే, ఆయన భాజపాలో చేరతారా? లేదంటే కాంగ్రెస్‌లోనా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి 27న జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఒక్క వారం రోజుల్లోనే ఇద్దరు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావడం గమనార్హం.  అర్కలగుడ్‌ సీటు నుంచి జేడీఎస్‌ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామస్వామి గత కొంత కాలంగా అధిష్ఠానంతో విభేదిస్తూ వస్తున్నారు. గతంలో ఈ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఎ.మంజు ఇటీవలే జేడీఎస్‌లో చేరడంతో ఆయన్ను ఆ సీటు నుంచే బరిలో దించే అవకాశం ఉంది.  మరోవైపు,  జేడీఎస్‌కు చెందిన ఇంకో ఎమ్మెల్యే శివలింగ గౌడ కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఇలా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడం జేడీఎస్‌కు ఇబ్బందికర పరిణామాలేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నేను పార్టీ వీడలేదు.. వాళ్లే బయటకు పంపించేశారు!

రాజీనామా అనంతరం ఎమ్మెల్యే రామస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేగా నేను సంతోషంగానే రాజీనామా చేస్తున్నా. నా రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశాను. స్పీకర్‌ వచ్చాక ఆయన్ను కలిసి ఆమోదించాలని కోరతాను. ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించినందుకు జేడీఎస్‌కు కృతజ్ఞతలు. నేను ఎప్పుడూ సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయలేదు. రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గానికి నిజాయతీగా సేవలందించాను. నేను జేడీఎస్‌ను వీడలేదు. వాళ్లే నన్ను బయటకు పంపారు. మనీ పవర్‌ ముందు నేను బలిపశువునయ్యా.  అధికారికంగా ఈ రోజే రాజీనామా చేసినందున భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను. ఇతర పార్టీల నుంచి నేతలు నన్ను కాంటాక్టు చేస్తున్నారు. అధికారికంగా ఏమీ లేకుండా దీనిపై నేను మాట్లాడటం కరెక్టు కాదు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేయాలనే నాకు ఉంది’’  అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని