Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్‌ కిశోర్‌!

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌పై అనర్హత వేటు విషయంలో పెద్ద మనసు చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించారు.

Published : 26 Mar 2023 01:31 IST

పట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌(Congress) సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష ఎక్కువేనని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌(Prashant Kishor) వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే.. ఆయనపై అనర్హత వేటు విషయంలో అధికార పక్షం పెద్ద మనసు చూపాలని కోరారు. బిహార్‌(Bihar)లో జన్‌సురాజ్‌ యాత్రలో ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. తమకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ పెద్దగా సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని తెలిపారు.

‘‘నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ.. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువ. ఎన్నికల సమయంలో నేతలు ఏవో మాట్లాడుతుంటారు. ఇది మొదటి ఘటన కాదు. చివరిదీ కాదు. నిబంధనల ప్రకారమే అనర్హత వేటు పడిందని అధికార పక్షం చెప్పొచ్చు. కానీ.. ‘సంకుచిత మనస్తత్వంతో ఎవరూ గొప్పవారు కాలేరు’ అన్న అటల్ బిహారీ వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోవాలి. రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించే విషయంలో తొందరపడకుండా ఉండాల్సింది. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు అవకాశమిచ్చి, అక్కడ అనుకూల ఫలితం రానప్పుడు చర్యలు తీసుకోవాల్సింది. ఏదేమైనా.. భాజపా ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్ద మనసు చూపాల్సిన బాధ్యత ఉంది’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ లోపాలపై మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌కు దాని వ్యతిరేక అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు! దిల్లీకే పరిమితమై, ఆవేశంగా ట్వీట్లు చేయడం, పార్లమెంటుకు ర్యాలీలు తీయడం ద్వారా రాజకీయ పోరాటం చేయలేమని అధిష్ఠానం గుర్తించాలి. ప్రజలతో మమేకమై దేశానికి ఎలా అన్యాయం జరుగుతోందో వివరించేందుకు యత్నిస్తున్న ఒక్క కాంగ్రెస్ కార్యకర్తనూ ఇక్కడ(సారణ్‌ జిల్లాలోని మార్హౌరా బ్లాక్‌) చూడలేదు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా పంచాయతీలు ఉన్నాయి. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే.. గ్రామస్థాయిలో పటిష్ఠమైతే తప్ప.. భాజపాను ఓడించలేమని గ్రహించాలి’’ అని  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని