శవపరీక్షకు సంతకం పెట్టాలని పోలీసులు కొట్టారు: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు

వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

Updated : 21 May 2022 18:52 IST

కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ సహా ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం పూర్తి కాలేదు. మృతుడి కుటుంబసభ్యులు అంగీకరించి సంతకం చేస్తేనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కనిపించకుండా ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. శవపంచనామా కోసం కుటుంబసభ్యులను తీసుకెళ్లారు. అయితే శవపరీక్ష కోసం సంతకం పెట్టాలని బలవంతం చేస్తున్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని కొట్టారని చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం భార్యను సైతం పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జీజీహెచ్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చేస్తున్న న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ సహా ఎస్సీ సంఘాల నాయకులను పోలీసులు లోపలికి అనుమతించారు. కాకినాడ జీజీహెచ్‌ వద్ద భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు