Published : 04 Nov 2021 01:34 IST

Leander Paes: మారింది మాధ్యమమే.. సేవ చేయాలన్న లక్ష్యం కాదు: లియాండర్‌ పేస్‌

పనాజీ: ‘‘చిన్నతనం నుంచే దేశానికి సేవ చేయాలని, దేశం గర్వించేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అలా 30 ఏళ్లపాటు క్రీడాకారుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించా. మరో విధంగా దేశానికి సేవలు చేయాలంటే రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అనిపించింది’’అని భారత టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌ తెలిపారు. ఇటీవల ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గోవాలో మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీలో లియాండర్‌ పేస్‌ చేరడం.. అక్కడి రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లియాండర్‌ పేస్‌ రాజకీయాలు, గోవా పరిస్థితుల గురించి మాట్లాడారు.

మాధ్యమమే మారింది.. సేవ కాదు!

ముప్పై ఏళ్ల కిందట నేను టెన్నిస్‌ క్రీడాకారుడిగా మారి దేశానికి సేవ చేశా. ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టా. మాధ్యమం మాత్రమే మారింది దేశానికి సేవ చేయాలన్న నా లక్ష్యం కాదు. 2014లోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. కానీ కుదర్లేదు. ఇప్పుడు నాకు రాజకీయాలపై దృష్టి పెట్టడానికి సమయం, సామర్థ్యం ఉన్నాయి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మమతా బెనర్జీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. దీదీతో కలిసి పనిచేస్తే బాగుంటుందని అనిపించింది. 

రాజకీయం అనేది మంచి పాలన కోసమే

కులం, మతం, జాతి ప్రాతిపదికన ప్రజలను విభజించడానికి రాజకీయాలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. నా వంశం గురించి నేనూ అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నా తల్లి బెంగాలీ.. తండ్రి గోవాకు చెందిన వారు. అయితే ఏంటి? నేను భారతీయుడిని. రాజకీయం ఇలాంటి వాటి కోసం కాదు.. మంచి పాలన అందించడానికి చేయాలి. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుంది.

గోవాలో చాలా సమస్యలు 

గోవాను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మంచినీటి కొరత అధికంగా ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజారవాణా, పారిశుద్ధ్యం, మత్స్యకార్మికుల సమస్యలు, నిరుద్యోగం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. 

ఎన్నికల్లో నిలబడటం నా చేతుల్లో లేదు

నేను టీఎంసీ జట్టులో సభ్యుడిని. ఎన్నికల్లో పోటీ గురించి మేమంతా చర్చించుకోవాలి. రాజకీయ పరిస్థితులపై విశ్లేషించాలి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటికి కట్టుబడి పనిచేస్తాం. నేను అభ్యర్థిగా నిలబడాలని నిర్ణయిస్తే దీదీనే ప్రకటిస్తారు కదా!

మమతా బెనర్జీ గురించి..

పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గొప్ప నాయకురాలు. ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితులోనైనా నిలబెట్టుకుంటారు. పేద, బలహీనవర్గాల పక్షపాతి. ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని