Corona: ఓట్ల కోసం నేతల పాట్లు.. ‘పాజిటివ్‌’ కష్టాలు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఓవైపు ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌ స్పెడర్లుగా మారే అవకాశముందని నిపుణులు

Published : 04 Jan 2022 16:08 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఓవైపు ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌ స్పెడర్లుగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. పలువురు నేతలకు వైరస్‌ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు రాజకీయ పార్టీల నేతలకు తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

కేజ్రీవాల్‌.. నిన్నటి వరకు ప్రచారంలోనే

 

తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేజ్రీవాల్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా.. కేజ్రీవాల్‌ సోమవారం వరకు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా తిరగడం గమనార్హం. ఇటీవల పంజాబ్‌, గోవాలో పర్యటించిన ఆయన.. నిన్న ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. 

కరోనాతో ఆసుపత్రిలో చేరిన కేంద్రమంత్రి..

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకు కరోనా సోకడంతో ఆసుప్రతిలో చేరారు. ‘‘గత రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నా. అందులో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా’’ అని మంత్రి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఆయన ఓసారి కరోనా బారినపడ్డారు. రెండు రోజుల క్రితం వరకు మహేంద్రనాథ్ పాండే కూడా యూపీలో పలు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఇక, భాజపా ఎంపీ మనోజ్‌ తివారీకి కూడా కరోనా సోకింది. జనవరి 2 రాత్రి నుంచి అనారోగ్యంగా ఉన్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈయనకు కూడా గతంలో కరోనా రెండో దశ ఉద్ధృతి సమయంలో కరోనా సోకింది. భాజపా స్టార్‌ ప్రచారకర్త అయిన తివారీ.. ఈ వారంతంలో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. చివరిసారిగా ఆయన.. డిసెంబరు 21న చండీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

బాబుల్‌ సుప్రియోకు మూడోసారి పాజిటివ్‌..

కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాబుల్‌ సుప్రియో మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన నేడు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనతో పాటు తన సతీమణి, తండ్రి, ఇతర వ్యక్తిగత సిబ్బందికి కూడా వైరస్‌ సోకినట్లు బాబుల్‌ తెలిపారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు 2020 నవంబరులో తొలిసారిగా బాబుల్‌ కుటుంబసభ్యులకు కొవిడ్‌ సోకింది. అప్పుడు వైరస్‌తో పోరాడుతూ ఆయన తల్లి కన్నుమూశారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో బాబుల్‌కు మరోసారి పాజిటివ్‌ వచ్చింది.  

స్వీయ నిర్బంధంలో ప్రియాంక గాంధీ వాద్రా..

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపైనా కరోనా ప్రభావం పడింది. ఆమె కుటుంబంలో ఒకరు, సిబ్బందిలో మరొకరికి వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆమె నిన్న ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తాను పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటానని, కొద్ది రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోన్నట్లు చెప్పారు. 

ఉత్తరప్రదేశ్‌ సహా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల్లో మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. భారీ సమూహాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నాయి. కీలక నేతల సభలకు లక్షల మంది ప్రజలు హాజరవుతున్నారు. ఓ వైపు ఒమిక్రాన్‌ వ్యాప్తితో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న తరుణంలో ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. దేశంలో మూడో ముప్పు పొంచి ఉన్న వేళ.. ఈ ర్యాలీటు సూపర్‌ స్పెడర్లుగా మారే అవకాశముందని అటు వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు