రాహుల్‌ గాంధీ ఒక ‘టూరిస్ట్‌ పొలిటీషియన్‌’!

బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ‘టూరిస్ట్‌ పొలిటీషయన్‌’గా కేంద్రమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Updated : 17 Apr 2021 10:22 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావొస్తున్న వేళ.. కొందరు ప్రచారానికి వచ్చి భాజపా డీఎన్‌ఏని ప్రశ్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌, బెంగాల్‌లో మాత్రం కలిసి పోటీ చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ‘టూరిస్ట్‌ పొలిటీషియన్‌’గా అమిత్‌ షా పేర్కొన్నారు.

బెంగాల్‌లో కీలకంగా ఉన్న మతువా వర్గానికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వారిని విస్మరించిందని కేంద్ర మంత్రి అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోన్న దీదీ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ఇక బెంగాల్‌లోకి అక్రమ చొరబాటుదారులను కేవలం భాజపానే ఆపగలదని.. ఈ విషయంలో తృణమూల్‌, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీలు ఆపని చేయలేవని అమిత్‌ షా స్పష్టం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం వల్లే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగాయని.. దీంతో సరిహద్దు జిల్లాగా ఉన్న నదియా ప్రజల సమూహ స్వరూపమే మారిపోయిందని ఆరోపించారు.

ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 8దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ నాలుగు దశల్లో 135 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. మరో 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 17న 45 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని