Amit Shah- Rahul Gandhi: రాహుల్‌.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్‌ షా

Amit Shah- Rahul Gandhi: విదేశాల్లో రాహుల్‌ చేస్తున్న వ్యాఖ్యల్ని అమిత్‌ షా తప్పుబట్టారు. భారత రాజకీయాలను విదేశీ గడ్డపై ప్రస్తావించడం తగదని హితవు పలికారు.

Published : 10 Jun 2023 16:15 IST

పాటన్‌ (గుజరాత్‌): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన విదేశీ పర్యటనల్లో భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావిస్తుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్‌ తమ పూర్వీకుల నుంచైనా నేర్చుకోవాలని హితవు పలికారు. గుజరాత్‌ పాటన్‌ జిల్లాలోని సిద్ధ్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

భారత్‌లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకే రాహుల్‌ విదేశీ యాత్రలు చేస్తున్నారని అమిత్‌ షా (Amit Shah) ఎద్దేవా చేశారు. అలా వెళ్లిన ప్రతిసారీ దేశంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. సొంత దేశాన్ని విదేశీ గడ్డపై విమర్శించడం ఏ నాయకుడికీ తగదన్నారు. దేశ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని రాహుల్‌ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు.

మోదీ (PM Modi) నేతృత్వంలో భారత్‌లో అనేక మార్పులు వచ్చాయని షా (Amit Shah) అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ విమర్శలు చేయడం మాత్రం ఆపడం లేదన్నారు. కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభ ఉత్సవానికి రాకపోవడాన్నీ ఈ సందర్భంగా షా తప్పుబట్టారు. సెంగోల్‌ ప్రతిష్ఠాపనను కాంగ్రెస్‌ (Congress) వ్యతిరేకించిందని చెప్పారు. వాస్తవానికి సెంగోల్‌ను తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూనే ప్రతిష్ఠించాల్సిందని అన్నారు. కానీ, అప్పుడు ఆయన చేయకపోవడం వల్లే ఇప్పుడు మోదీ ప్రతిష్ఠించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, డిజిటల్‌ అనుసంధానం, సంక్షేమ పథకాల అమలు, కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఇలా చాలా విషయాల్లో భారత్‌ ఇప్పుడు మొత్తం ప్రపంచానికే ఆశారేఖగా కనిపిస్తోందని షా (Amit Shah) అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో పది సంవత్సరాల పాలనను ఇప్పుడు మోదీ ప్రభుత్వ పాలనతో పోల్చి చూసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి, అస్థిరత, ఆర్థిక వ్యవస్థ పతనం, శాంతి భద్రతల సమస్యలే కనిపించేవని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపానే గెలిపించాలని గుజరాత్‌ ప్రజలకు అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని