వారసత్వ రాజకీయాలే ఆ పార్టీల లక్ష్యం: షా

డీఎంకే పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఇటీవల డీఎంకే నేత రాజా సీఎం పళనిస్వామి తల్లి గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు.

Published : 02 Apr 2021 01:36 IST

చెన్నై: డీఎంకే పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఇటీవల డీఎంకే నేత రాజా సీఎం పళనిస్వామి తల్లిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుకోయిలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 6న జరగబోయే ఎన్నికల్లో మహిళలంతా డీఎంకే పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

‘కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తాయి. ఒక దివంగత మహిళపై డీఎంకే నేత రాజా చేసిన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలోనూ డీఎంకే నేతలు దివంగత మాజీ సీఎం జయలలితపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పార్టీకి మహిళలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎన్నికల సమరం అభివృద్ధి పథంలో నడిచే ఎన్డీయేకు.. అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే యూపీఏకు మధ్య జరుగుతోంది’ అని షా మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఓ వైపు కాంగ్రెస్‌ నాయకురాలు సోనియగాంధీ తన కుమారుడు రాహుల్‌కు అధికారం అందించే బెంగతో ఉండగా.. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధి మీద బెంగతో ఉన్నారని విమర్శించారు.  తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని