Ajit Pawar: అజిత్‌ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే

ఎన్సీపీ (NCP)కి కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకొచ్చారు. అయితే కీలక నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar)కు ఆ పదవి దక్కలేదు. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలేతో పాటు మరో వ్యక్తికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించారు.

Published : 10 Jun 2023 15:03 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) పార్టీ బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కొత్తగా ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించారు. అయితే, ఇందులో కీలక నేత అజిత్ పవార్‌ (Ajit Pawar)కు చోటు దక్కకపోవడం గమనార్హం. తన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule), సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ (Praful Patel)కు పవార్‌ ఈ బాధ్యతలు అప్పగించారు.

ఎన్సీపీ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబయిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులోనే పవార్‌.. వర్కింగ్‌ ప్రెసిడెంట్ల (working presidents) పేర్లను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అజిత్‌ పవార్‌ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌, విమెన్‌ యూత్‌, లోక్‌సభ కోఆర్డినేషన్‌ బాధ్యతలను అప్పగించారు. ఇక, ప్రఫుల్‌ పటేల్‌కు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గోవా వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు.

కాగా.. ఇటీవల ఎన్సీపీ అధ్యక్షుడిగా వైదొలుగుతున్నట్లు ఇటీవల శరద్‌ పవార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ ప్యానెల్‌ వ్యతిరేకించింది. ఆయన రాజీనామాను తిరస్కరించింది. అధినాయకత్వ బాధ్యతలను కొనసాగించాలని పార్టీ కోరింది. దీంతో మనసు మార్చుకున్న పవార్‌.. రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే, పవార్‌ రాజీనామా సమయంలో అజిత్‌ పవార్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, శరద్‌ పవార్‌ వెనక్కి తగ్గడంతో ఆ వార్తలకు బ్రేక్‌ పడింది. అనంతరం పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అజిత్‌ పవార్‌కు కీలక బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, అనూహ్యంగా ఆయనను పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది.

అజిత్‌ ట్వీట్‌..

అయితే ఈ పరిణామాలపై అజిత్‌ పవార్‌ ట్విటర్‌లో స్పందించారు. నూతనంగా ఎన్నికైన వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శరద్‌ పవార్‌ నాయకత్వంలో ఎన్సీపీ పార్టీ సిల్వర్‌ జూబ్లీలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రం, ఈ దేశ ప్రజల కోసం మా విలువైన సహకారాన్ని మరింతగా అందిస్తాం. ఈ లక్ష్యం కోసం మా పార్టీలో ప్రతి కార్యకర్త, నేతలు పనిచేస్తారని ఆశిస్తున్నా. కొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక అధ్యక్షులకు అభినందనలు’’ అని పవార్‌ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని