Sharad Pawar: ‘రాజీనామాపై ఇంత తీవ్ర స్పందన వస్తుందని ఊహించలేదు..!’

ఎన్సీపీ అధ్యక్ష పదవికి తన రాజీనామా విషయంలో పార్టీ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని ఊహించలేదని శరద్‌ పవార్‌ పేర్కొ్న్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Published : 06 May 2023 21:47 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్ష పదవికి రాజీనామాను శరద్‌ పవార్‌ (Sharad Pawar) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే, తన రాజీనామా విషయంలో పార్టీ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని ఊహించలేదని పవార్ తెలిపారు. తన రాజీనామాను అంగీకరించరని తెలిసే.. ఈ విషయంలో పార్టీ వర్గాలను ముందుగా సంప్రదించలేదన్నారు. ‘వారిని ఒప్పిస్తానని భావించా.. కానీ, సాధ్యపడలేదు. అందుకే వారి మనోభావాలను గౌరవిస్తూ.. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గాను’ అని పవార్‌ మీడియాకు వివరించారు.

‘56 ఏళ్లుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజాజీవితంలో కొనసాగుతోన్నా. ఎంపీగా ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర, దేశస్థాయిలో ఎన్సీపీని నడిపించేందుకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావడాన్ని కర్తవ్యంగా భావించా. పైగా, ఏదో ఒక సమయంలో నేను రాజీనామా చేయాల్సిందే. అందుకే పక్కకు తప్పుకొని రాబోయే తరానికి అవకాశం ఇవ్వాలని అనుకున్నా. ఇతర పార్టీలపై ప్రభావం పడకుండా.. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదంతా చేసినప్పటికీ.. రాజీనామా విషయంలో పార్టీ వర్గాలను ఒప్పించలేకపోయా’ అని పవార్ తెలిపారు.

చాలా మంది జాతీయ స్థాయి నేతలు కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించినట్లు శరద్‌ పవార్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఐక్యతపై మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భావసారూప్యత గల పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అజిత్‌ పవార్‌ ఎన్సీపీని వీడి భాజపాలో చేరతారనే ఊహాగానాలను కొట్టిపారేశారు. ఎటువంటి కారణాలు లేకుండా అజిత్ పవార్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని