Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో దూకుడు.. ‘మహా’ పట్టుకు శరద్‌ పవార్‌ ప్రయత్నాలు

మరికొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ రాష్ట్రంపై పూర్తి పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. 

Published : 13 Jun 2024 16:37 IST

ముంబయి: రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు మహారాష్ట్ర (Maharashtra)పై పూర్తి పట్టు సాధించేందుకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా యత్నిస్తోంది. పార్టీలో చీలిక ఏర్పడినా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్సీపీ.. ఈ సారి ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) ధీమా వ్యక్తంచేశారు.

‘‘ఎన్నికల సమయంలో ప్రజలు మౌనంగా ఉన్నారని.. బహిరంగా ఏమీ మాట్లాడలేదని పార్టీ కార్యకర్తలు నాతో చెప్పారు. వాళ్ల మనసులో ఏముందో చెప్పకపోయినప్పటికీ ఆందోళన చెందవద్దని చెప్పా. ప్రజలు ఈవీఎంలలో సరైన బటన్‌ నొక్కుతారని.. గాబరా పడవద్దని కార్యకర్తలకు చెప్పాను. చివరకు నేను అనుకున్నదే జరిగింది. ఈవీఎంలు తెరిచి చూస్తే.. ఓటర్లు చేసిన మ్యాజిక్‌ కనిపించింది’’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బారామతిని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఎలాంటి హామీలు ఇవ్వలేను..

‘‘మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ ఎన్నికలు ఎన్సీపీకి ఎంతో కీలకం. సమష్టి కృషితోనే ఇవన్నీ నేరవేరుతాయి. ప్రస్తుతం నేను ఎలాంటి హామీలు ఇవ్వలేను. ఎందుకంటే.. వేరే పార్టీ అధికారంలో ఉన్నందున సమస్యలను పరిష్కరించలేను. ఎన్నికల అనంతరం అన్ని సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తా’’ అని శరద్‌ పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకార వేదికపై అమిత్‌ షా, తమిళిసై సీరియస్‌ సంభాషణ!

కాగా.. మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలు ఉండగా.. ఎంవీయే పక్షాలతో కలిసి 10 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిదింటిని గెలుచుకుంది. అజిత్‌ పవార్‌ వర్గం ఒక్క సీటుకే పరిమితమయ్యింది. దీంతో అసలైన ఎన్సీపీ తమదేనని శరద్‌ పవార్‌ నిరూపించున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన శరద్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని