Andhra News: వైకాపా ప్రభుత్వం కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలే: షరీఫ్‌

అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం మళ్లీ తల గోక్కుంటదని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్ అన్నారు.  ప్రభుత్వం మళ్లీ కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలేనని కొట్టిపారేశారు...

Updated : 18 Mar 2022 06:37 IST

గుంటూరు: అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం మళ్లీ తల గోక్కుంటదని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్ అన్నారు.  ప్రభుత్వం మళ్లీ కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలేనని కొట్టిపారేశారు. గురువారం రాత్రి గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షరీఫ్‌ను జిల్లా తెదేపా నేతలు ఘనంగా సన్మానించారు. రాజధాని రైతులు, ఐకాస నేతలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ... ‘‘అమరావతి కోసం పోరాడుతున్న రైతులే సన్మానానికి అర్హులు. త్రికరణ శుద్ధిగా పనిచేయాలన్న చంద్రబాబు పాఠాలు పాటించాను. 3 రాజధానుల బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపినప్పుడు అందరూ అభినందించారు. తెదేపా ఎమ్మెల్సీలు ఎవరూ ప్రలోభాలకు లొంగలేదు.  ఎమ్మెల్సీలు అండగా ఉండటంతో ధైర్యంగా ముందుకెళ్లా’’ అంటూ 3 రాజధానుల బిల్లు మండలిలో ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన ఘటనలు షరీఫ్‌ గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌నేత దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. అధికారం ఉందని వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా చేశారని విమర్శించారు. 3 రాజధానుల బిల్లు సందర్భంగా   మండలి ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ను అవమానించారని పేర్కొన్నారు. షరీఫ్‌ ధైర్యం వల్లే రాజధానిగా అమరావతి సజీవంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని షరీఫ్‌ చాటిచెప్పారన్నారు. ప్రజా రాజధానిని కాదనే హక్కు ఈ సీఎంకు లేదన్నారు. అమరావతిని రాజ్యాంగబద్ధంగా షరీఫ్‌ కాపాడారని వివరించారు. గాంధారి పుత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని