Shashi Tharoor: తప్పు జరిగింది.. బేషరతుగా క్షమాపణ చెబుతున్నా: శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నిక కోసం ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తీవ్రమైన తప్పిదం చోటుచేసుకుంది.....

Updated : 01 Oct 2022 09:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నిక కోసం ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తీవ్రమైన తప్పిదం చోటుచేసుకుంది. మేనిఫెస్టోలో ప్రచురించిన భారత మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ లేకపోవడం పెను దుమారానికి కారణమైంది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ట్విటర్‌లో స్పందించిన శశిథరూర్‌ జరిగిన తప్పునకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘‘మేనిఫోస్టోలో మ్యాప్‌పై ట్రోల్స్‌ తుపాను కొనసాగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఇలాంటి పనులు చేయరు. ఓ చిన్న వాలంటీర్ల బృందం ఈ పొరపాటు చేసింది. తక్షణమే మేం దాన్ని సవరించాం. ఈ తప్పునకు క్షమాపణలు చెబుతున్నా. మా మానిఫెస్టో ఇదిగో’’ అని పేర్కొంటూ తన ట్విటర్‌లో హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను జత చేశారు. 

అసలేం జరిగిందంటే?

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న శశిథరూర్‌ శుక్రవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే అందులో ఈ మేనిఫెస్టో బుక్‌లెట్‌లో ఓ చోట భారత చిత్రపటం ఉండగా అందులో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు లేవు. కాంగ్రెస్‌ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే ఈ ఫొటోలో కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు లేకపోవడం గమనార్హం. ఈ తప్పిదాన్ని కొందరు సోషల్‌మీడియా యూజర్లు గమనించి ట్వీట్లు చేయడంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది. థరూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పొరపాటును గమనించిన థరూర్‌ కార్యాలయం వెంటనే దాన్ని సరిదిద్దుకుంది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌తో ఉన్న అఖండ భారత చిత్రపటంతో కొత్త మేనిఫెస్టో విడుదల చేసింది.

మరోవైపు, థరూర్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2019 డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల గురించి ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అందులోనూ భారత చిత్రపటానికి సంబంధించి ఇలాంటి తప్పిదమే దొర్లింది. అప్పుడు థరూర్‌పై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఆ ట్వీట్‌ను ఆయన తొలగించారు.

అధ్యక్ష పదవికి శశి థరూర్‌తో పాటు సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్‌ పత్రాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పోటీలో ఉండేది ఎవరన్నది తేలుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8వ తేదీ వరకు గడువు ఉంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17న ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఫలితాన్ని వెల్లడించనున్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని