Shashi Tharoor: శశిథరూర్‌ ‘నీట్‌’ కౌంటర్‌.. ‘ఉత్తర్‌’ ప్రదేశ్‌పై ఘాటు వ్యాఖ్యలు

నీట్‌-యూజీ 2024 ప్రవేశ పరీక్ష వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ చేసిన పోస్టు రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది.

Published : 24 Jun 2024 00:13 IST

దిల్లీ: తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తంచేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలపై దెబ్బకొడతాయి. నీట్‌-యూజీ 2024 ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ.. ‘ఎక్స్‌’లో ఆయన పెట్టిన పోస్టు రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ను తక్కువ చేసేలా ఆయన వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయి. దీనిపై భాజపా చిర్రుబుర్రులాడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

శనివారం రాత్రి శశి థరూర్‌ ఎక్స్‌ వేదిగా హిందీలో ఓ ఫొటోను పోస్టు చేశారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌ అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఏ రాష్ట్రంలో అయితే పరీక్షలకు ముందే జవాబులు (ఉత్తర్‌) బయటకొస్తాయో అదే ఉత్తర్‌ప్రదేశ్‌ ’ అని రాసి ఉంది. దీనికి ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ పరీక్షా పే చర్చ’ ఖాతాను కూడా ట్యాగ్‌ చేశారు. నెట్‌, నీట్‌-యూజీ 2024 పరీక్షలతోపాటు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీకైన నేపథ్యంలో.. అటు కేంద్రానికి, ఇటు యూపీ ప్రభుత్వానికి చురకలు అంటించేలా ఈ పోస్టు ఉంది. ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పేపర్లు లీకయ్యాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గతంలోఈ రాష్ట్రంలో 62 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న భాజపా.. తాజాగా 33 స్థానాలకు పడిపోవడానికి పేపర్ల లీకేజీ కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా, శశి థరూర్‌ పోస్టుపై.. భాజపా నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ‘‘ నా రాష్ట్రాన్ని కించపరుస్తూ శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యల్లో హస్యమేమీ కనిపించడం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం యూపీ ప్రజలను కించపరచడమే. దీనిని ప్రజలంతా ఖండించాలి’’ అని కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద డిమాండ్‌ చేశారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటేని, ఇదే దేశంలో పుట్టినవారిని కించపరచడం వారికే చెల్లిందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. ప్రపంచ పౌరుడిగా చెప్పుకొనే థరూర్‌ లాంటి స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎద్దేవా చేశారు. ఇటీవల అదే పార్టీకి చెందిన శ్యామ్‌ పిట్రోడా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారని భారతీయులు ఆఫ్రికన్స్‌లా, చైనీయుల్లా ఉంటారని అవహేళన చేశారని మండిపడ్డారు. సుపీరియారిటీ కాంప్లెక్‌ కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించారు. యూపీ ప్రజలను మోసగాళ్లుగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టడం సరికాదని, ఇది క్షమించరాని నేరమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌ మండిపడ్డారు.

నీట్-యూజీ 2024 పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జులై 6 నుంచి యథాతథంగా కౌన్సిలింగ్‌ కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ (CBI) ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని