Shashi Tharoor: గుజరాత్‌ ఎన్నికలు.. కాంగ్రెస్‌ ప్రచారానికి శశిథరూర్‌ దూరం..!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పార్టీ అధినాయకత్వం తీరుతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Published : 16 Nov 2022 11:49 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌కు.. పార్టీకి మధ్య బంధం బీటలువారుతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కీలకమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే ప్రముఖుల జాబితాను కాంగ్రెస్‌ ఇటీవల విడుదల చేసింది. అయితే, ఇందులో థరూర్‌ పేరు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

గుజరాత్‌లో ప్రచారానికి రావాల్సిందిగా కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం శశిథరూర్‌ను ఆహ్వానించింది. అయితే, దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతోనే థరూర్‌ ఈ ఆహ్వానాన్ని అంగీకరించలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. థరూర్‌ను పార్టీ దూరం పెడుతోందంటూ వస్తోన్న వార్తలను కాంగ్రెస్‌ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘గతంలోనూ ఎన్నడూ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో థరూర్‌ పేరు లేదు’’ అని స్పష్టం చేశాయి.

గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారానికి గానూ 40 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్ బఘేల్‌, సచిన్‌ పైలట్‌, జగదీశ్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ, మాజీ సీఎంలు దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌ నాథ్‌, భూపిందర్‌ సింగ్‌ హుడా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రకు నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు దాదాపు లేవు. హిమాచల్ ఎన్నికల్లోనూ రాహుల్ ప్రచారం చేయలేదు. దీంతో ఆ బాధ్యతలను ప్రియాంక గాంధీ, భూపేశ్ బఘేల్‌ భుజానెత్తుకున్నారు.

గుజరాత్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న భాజపా.. ఈసారి కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుండగా.. పంజాబ్‌ విజయంతో జోరుమీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఈసారి గుజరాత్‌లో త్రిముఖ పోరు నెలకొంది. డిసెంబరు 8న గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని