Shashi Tharoor: ఖర్గే వ్యాఖ్యకు థరూర్ కౌంటర్..!

కాంగ్రెస్ అధ్యక్ష పోరులో భాగంగా సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు మరో నేత థరూర్ తనదైన శైలిలో స్పందించారు. 

Published : 03 Oct 2022 12:02 IST

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో బరిలో మిగిలిన ఇద్దరు అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మరో నేత శశిథరూర్ ట్విటర్ వేదిక స్పందించారు. సమర్థవంతమైన నాయకత్వ ఎంపికకు ఇదొక అవకాశమంటూ పోస్టు పెట్టారు.  

నిన్న ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా, థరూర్‌ మాత్రం పోటీనే కోరుకున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్‌ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని పేర్కొన్నారు. అలాగని తాను గాంధీ కుటుంబ మద్దతు ఉన్న అధికారిక అభ్యర్థిని కాదని స్పష్టంచేశారు.  భాజపాపై పోరాడడానికి నేతలంతా ఒక్కటై తనకు మద్దతు ఇస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

దీనిపై థరూర్ ట్విటర్ వేదికగా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ కాదన్నారు. అయితే భాజపాపై ఎంతసమర్థవంతంగా పోటీ ఉండాలనేదానిని నిర్ణయించేందుకు ఈ ఎన్నిక ఓ అవకాశమన్నారు. ఖర్గేకు, తనకు మధ్య ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవని వెల్లడించారు. ఇదివరకు థరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను మార్చాల్సిన అవసరం ఉందని, అయితే ఖర్గే గెలిస్తే పార్టీలో పాతపద్ధతులే కొనసాగుతాయని వ్యాఖ్యానించారు.

ఈ అధ్యక్ష ఎన్నిక పోటీ కోసం ఎన్నో పేర్లు వినిపించినా, చివరకు ఖర్గే, థరూర్ మాత్రమే పోటీలో నిలిచారు.  దీంతో ఈ ఎన్నికలో ద్విముఖ పోరు నెలకొంది. అయితే, గాంధీ కుటుంబం అండతో పాటు పార్టీలో అత్యధికుల మద్దతు ఉన్న ఖర్గేనే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని