Congress: శశిథరూర్‌ నామినేషన్ ఆ రోజే‌.. బన్సల్‌ నామినేషన్‌ పత్రాలు ఎవరికో?

కాంగ్రెస్(congress) తదుపరి అధ్యక్షుడు ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు శశిథరూర్‌(Shashi Tharoor) ఇప్పటికే రంగంలోకి దిగగా రాజస్థాన్‌ పరిణామాల నేపథ్యంలో......

Updated : 27 Sep 2022 16:28 IST

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మిస్త్రీ 

దిల్లీ: కాంగ్రెస్(congress) తదుపరి అధ్యక్షుడు ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు శశిథరూర్‌(Shashi Tharoor) ఇప్పటికే రంగంలోకి దిగగా రాజస్థాన్‌ పరిణామాల నేపథ్యంలో అశోక్‌ గహ్లోత్‌ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్‌ వీడని తరుణంలో ఇంకెవరు పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ  మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. గత శనివారం నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లిన శశిథరూర్‌ ఈ నెల 30న నామినేషన్‌ వేస్తారని వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11గంటలకు శశిథరూర్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేస్తారంటూ ఆయన ప్రతినిధి తమ కార్యాలయానికి సమాచారం ఇచ్చారన్నారు. అలాగే, ఏఐసీసీ కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌ కూడా నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లారని.. అయితే, అవి ఆయన కోసమా? లేదంటే ఇంకెవరికోసమైనా తీసుకెళ్లారా? అనే విషయం స్పష్టతలేదన్నారు. దీంతో థరూర్‌పై బన్సల్‌ పోటీ చేయబోతున్నారా? అనే చర్చ ఊపందుకుంటోంది.

ఈరోజు తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసం 10జన్‌పథ్‌లో కలిసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ఓటర్‌ గుర్తింపు కార్డులను అందజేయడంతో పాటు ఎంత మంది నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు? ప్రతినిధులకు సంబంధించిన విషయాలను వివరించినట్టు వెల్లడించారు. పార్టీ కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌ కూడా తన కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్‌ పత్రాలు పట్టుకెళ్లారని.. అయితే, అవి ఎవరికోసమైనా ఆయన తీసుకెళ్లి ఉండొచ్చని తెలిపారు. అయితే, ఆ పత్రాలు బన్సల్‌ కోసమేనా? ఇంకెవరి తరఫునైనా ఆయన తీసుకెళ్లారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. ఫారమ్‌లను ఎవరికోసం తీసుకెళ్తున్నారో అడగడం నిబంధనలకు విరుద్ధం.. ప్రతినిధులు ఎవరైనా ఈ ఫారమ్‌లను సేకరించవచ్చు అందుకే.. ఆయన ఎవరికోసం నామపత్రాలు తీసుకెళ్లారో తాను చెప్పలేనన్నారు. 

అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 24 నుంచి 30వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. అక్టోబర్‌ 1న నామపత్రాలు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్‌ 8. అదేరోజు సాయంత్రం 5గంటలకు బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఒకరు కన్నా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే అక్టోబర్‌ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని