Eknath Shindhe: ఏక్‌నాథ్‌ శిందే సర్కార్‌కు సోమవారమే బల పరీక్ష

మహారాష్ట్రలో ఉత్కంఠ రాజకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష (Floor  test)కు తేదీ ఖరారైంది.......

Published : 01 Jul 2022 18:48 IST

ముంబయి: మహారాష్ట్రలో ఉత్కంఠ రాజకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష (Floor  test)కు తేదీ ఖరారైంది. భాజపా-శివసేన తిరుగుబాటు వర్గం కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 4న బలపరీక్ష ఎదుర్కోనుందని అధికారులు వెల్లడించారు. సోమవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో స్పీకర్‌ పదవి కోసం భాజపా ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అవసరమైతే జులై 3న స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. గతేడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ నేత నానా పటేలో రాజీనామా తర్వాత స్పీకర్‌ స్థానం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక వ్యక్తిగా నిలుస్తారనుకున్న ఏక్‌నాథ్‌ శిందే ఆశ్చర్యకరమైన రీతిలో ఏకంగా సీఎం పదవిని అధిష్ఠించారు. గురువారం రాత్రి ఆయన ముఖ్యమంత్రిగా, నాటకీయ పరిణామాల మధ్య  దేవేంద్ర ఫడణవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తమకు ఎంత బలం ఉందో నిరూపించుకోవాల్సి ఉన్నందున గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ అందుకు సోమవారం వరకు గడువు విధించారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 3,4 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక, శివసేనకు మొత్తంగా ఉన్న  55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది తన వర్గంలో ఉన్నారని సీఎం శిందే చెబుతున్నారు. భాజపాకు 106 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కొత్త ప్రభుత్వానికి కమల దళం, ఇంకొన్ని పార్టీలు, స్వతంత్రుల మద్దతు ఉండటంతో మొత్తంగా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు నిన్న గవర్నర్‌కు శిందే తెలిపారు. మరోవైపు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 144 మంది సభ్యుల మద్దతు అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని