Punjab: పంజాబ్‌లో పొడిచిన కొత్త పొత్తు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో పొత్తుల పర్వం ప్రారంభమైంది. గత ఏడాది భాజపాతో తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కూటమి కట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం....

Updated : 12 Jun 2021 13:53 IST

దిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో పొత్తుల పర్వం ప్రారంభమైంది. గత ఏడాది భాజపాతో తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కూటమి కట్టింది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీ 20 సీట్లలో పోటీ చేయనుండగా.. మిగిలిన స్థానాల్లో అకాలీదళ్‌ బరిలోకి దగనుంది.

భాజపాతో పొత్తు విరమించుకున్న తర్వాత ఆయా స్థానాల్లో గ్యాప్‌ను పూడ్చుకునేందుకు అకాలీదళ్‌.. బీఎస్పీతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో 2017లో 90 చోట్ల శిరోమణి, మిగిలిన స్థానాల్లో భాజపా పోటీ చేసిన విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత శిరోమణి, బీఎస్పీ పొత్తుకు సిద్ధమయ్యాయి. 1996లో ఇరు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయగా.. 13 స్థానాలకుగానూ 11 సీట్లలో గెలుపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బీఎస్పీ పోటీ చేసిన మూడు స్థానాల్లో విజయ పతాకం ఎగురవేయగా.. శిరోమణి 10 స్థానాల్లో బరిలోకి దిగి 8 సీట్లలో గెలుపొందింది.

అకాలీదళ్‌ పార్టీ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ బీఎస్పీతో పొత్తు వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని గత వారం స్పష్టం చేసిన ఆయన కూటమి ఏర్పాటుకు ఇతర పార్టీలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దాదాపు 31 శాతం ఎస్సీ జనాభా ఉన్న పంజాబ్‌లో బీఎస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ ఉంది. ముఖ్యంగా దోయబా ప్రాంతంలో ఉన్న 23 నియోజకవర్గాల్లో 40 శాతం జనాభా ఎస్సీలే కావడం గమనార్హం.

2007లో 37.9 శాతం ఓట్లు సంపాదించిన అకాలీదళ్‌ 2017 నాటికి 25.2 శాతానికి పడిపోయింది. ఇక ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీఎస్పీ 2017లో 1.5 శాతం ఓట్లు సంపాదించగలిగింది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ 23.7 శాతం ఓట్లతో 2017లో పంజాబ్‌లో కొత్త శక్తిగా అవతరించింది. ఇక భాజపా ఓట్ల శాతం 2007లో 8.24 శాతం నుంచి 2017లో 5.4 శాతానికి పడిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని