Sanjay Raut: మోదీజీ.. మీ మంత్రి పవార్‌ను బెదిరిస్తుంటే ఊరుకుంటున్నారా..?

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేంద్రమంత్రిపై శివసేన నేత సంజయ్ రౌత్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.

Published : 24 Jun 2022 11:20 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ కేంద్రమంత్రిపై శివసేన నేత సంజయ్ రౌత్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఒక కేంద్రమంత్రి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను బెదిరించారని, అందుకు ప్రధాని మోదీ, భాజపా అగ్రనేత అమిత్‌ షా మద్దతు ఇస్తారా..? అని ప్రశ్నించారు. అలాగే శిందే వర్గాన్ని ఉద్దేశించి.. అలలు వస్తాయి, పోతాయని వ్యాఖ్యలు చేశారు.

‘ఆయన మహారాష్ట్ర బిడ్డ. వారు ఆయన్ను బెదిరిస్తున్నారు. మోదీజీ, అమిత్‌ షా.. వీటి గురించి మీరు విన్నారా..? మీ మంత్రి పవార్‌ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు మీరు మద్దతు ఇస్తున్నారా..? మీ వైఖరేంటో మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మహావికాస్‌ ఆఘాడీని కాపాడేందుకు పవార్‌ ప్రయత్నిస్తే.. ఆయన్ను ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటామని ఆ మంత్రి బెదిరించారు. రోడ్డు మీద నిలువరిస్తామని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదే భాజపా పనితీరు అయితే.. అదే విషయాన్ని మీరే ప్రకటించండి. ప్రభుత్వం ఉండొచ్చు లేక పడిపోవచ్చు.. కానీ పవార్‌తో వ్యవహరించిన తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అంటూ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. 

అలాగే శిందే వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వారి సంఖ్య కేవలం కాగితంపైనే ఉందన్నారు. ‘శివసేన ఒక సముద్రం. అలలు వస్తాయి. పోతాయి’ అని వ్యాఖ్యానించారు. ‘నిబంధనలు అంటూ కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఇది ఒక న్యాయపోరాటం. కొంతమంది 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఇంకొకరు ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఏదైనా ముంబయికి వచ్చిన తర్వాతే ఆ లెక్క తేలేది. అంకెలు, కాగితాల పరంగా, వీధుల్లో.. ఇలా ఏ రూపంలో పోరాటం జరిగినా చివరకు గెలిచేది మేమే’ అంటూ సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. అసమ్మతి ఎమ్మెల్యేలు 24 గంటల్లోగా ముంబయికి తిరిగివస్తే..సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సంజయ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు శివసేన నేత ఈ ప్రకటన చేశారని పవార్ అన్నారు. ఈ అనూహ్య పరిణామం మధ్య ఇరువురు నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని