Uddhav Thackeray: ఆ రోజు ఠాక్రే సాయం చేయకపోతే.. మోదీ ఇలా ఉండేవారా..?

బీఎంసీ(BMC) ఎన్నికలు భాజపా(BJP), ఠాక్రే వర్గం శివసేనకు కీలకంగా మారాయి. ఈ క్రమంలో రెండు పార్టీలు ఓటర్లను తమవైపు మరల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

Published : 13 Feb 2023 12:00 IST

ముంబయి: ప్రధాని మోదీ(Modi)ని ఉద్దేశించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే(Bal Thackeray ) మోదీని కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. అలాగే భాజపాతో తెగిన బంధం గురించి స్పందించారు. ముంబయిలో ఉత్తర భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘నేను భాజపా(Bjp)తో బంధం తెంచుకున్నాను. కానీ హిందుత్వతో కాదు. భాజపా అనుసరించేది హిందుత్వ కాదు. హిందుత్వ అంటే ఏంటో భాజపా నుంచి ఉత్తర భారతీయులు సమాధానం కోరుతున్నారు. దాని ఉద్దేశం ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు. భాజపా.. హిందువుల మధ్య చీలికను సృష్టిస్తోంది. మతంతో సంబంధం లేకుండా భారత్‌ను ద్వేషించేవారికే బాలాసాహెబ్ వ్యతిరేకం’ అని అన్నారు. తమ పార్టీ 25-30 ఏళ్లు రాజకీయపరమైన స్నేహబంధాన్ని కాపాడిందని గుర్తు చేశారు. వారు(భాజపాను ఉద్దేశించి) మాత్రం తమని వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. శివసేన(Shiv Sena), అకాలీదళ్‌(Shiromani Akali Dal)తో ఉన్న సుదీర్ఘ బంధానికి బీటలు వారడాన్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. తన మర్యాదను కాపాడుకోవడానికే భాజపాతో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చానని చెప్పారు. లేకపోతే ఇప్పుడు కొంతమంది(శిందే వర్గాన్ని ఉద్దేశించి) ఎదుర్కొంటోన్న బానిసత్వాన్ని చవిచూడాల్సి వచ్చేదన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా మోదీకి బాల్‌ ఠాక్రే(Bal Thackeray ) చేసిన మాట సాయాన్ని గుర్తు చేశారు. ‘మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని గౌరవించాలని భావించిన సమయంలో.. ప్రధాని మోదీని కాపాడింది బాల్‌ఠాక్రేనే. ఆ రోజు ఆయన ఆ సాయం చేయకపోతే.. మోదీ ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు’ అని వెల్లడించారు. 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత రాజధర్మాన్ని పాటించాలని మోదీకి వాజ్‌పేయీ చేసిన సూచనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో జరగనున్న బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్(BMC) ఎన్నికలు ముంబయిలో రాజకీయ వేడిని రాజేశాయి. శివసేన(ఠాక్రే వర్గం) నుంచి.. ఈ పౌర సంస్థ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భాజపా దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మోదీతో సహా అగ్రనేతలు ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏక్‌నాథ్‌ శిందేతో కలిసి ఉద్ధవ్‌కు అధికారాన్ని దూరం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు